ఎన్నికల ఫలితాల ముందు వైసీపీకి ఏదీ కలిసి రావటం లేదు. ఓటమి భయంతో వణికిపోతున్న ఆ పార్టీకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పిన్నెల్లి విషయంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బకు తోడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమిదే విజయం అని కోడై కూస్తున్న దశలో సుప్రీంకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తమకు ఆమోదయోగ్యమైంది కాదని… 13ఫాం నిబంధనలకు విరుద్దంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఈసీ నిర్ణయం తీసుకుందని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నిజానికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో సీఈవో మీనా ఓ క్లారిటీ ఇచ్చారు. సీల్ లేదనో అటెస్టేషన్ లేదనో ఓటును చెల్లకుండా చేయలేమని… ఆ ఓట్లు కూడా చెల్లుతాయని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేయటంతో పాటు హైకోర్టును ఆశ్రయించగా, ఆ రెండు చోట్ల కూడా వైసీపీకి చుక్కెదురైంది.
తాజాగా… చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీం వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఒక్క ఏపీకే ఈ నిబంధన పెట్టారని… ఇది సరైంది కాదని వాదించారు. అయితే, ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కు ముందు రోజు ఈ పిటిషన్ పై విచారణ సాధ్యంకాదని, ఎన్నికల సంఘం నిర్ణయంలో ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం కూడా సమర్థించింది. ఈ కేసులో ఎలాంటి మెరిట్స్ లేనందున పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.