శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ చాలామంది జీవితాల్ని మార్చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్థిరపడిపోయినవాళ్లు ఎంతోమంది. అందులో టైసన్ గా మెప్పించిన రాహుల్ కూడా ‘హ్యాపీడేస్’ తరవాత హీరోగా మారాడు. కొన్ని సినిమాలు చేశాడు. కానీ పెద్దగా ప్రభావితం చేయలేకపోయాడు. అందుకే గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘భజే వాయు వేగం’తో మెరిశాడు. కార్తికేయ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. టైసన్‌కు ఈ సినిమాతో మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరోసారి నిలదొక్కుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా మంచి లైనప్ సెట్ చేసుకొన్నాడు. ఇప్పుడు తన చేతిలో మూడు సినిమాలున్నాయి.
యూవీ క్రియేషన్స్ లో… రాహుల్ హీరోగా ఓ సినిమా మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ అంటే క్రేజ్ లో ఉన్న బ్యానరే. ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ సెట్ అయిపోతుందని భావిస్తున్నాడు రాహుల్. వార్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న మరో సినిమాలో.. రాహులే హీరో. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే మరో సినిమా చేస్తున్నాడు రాహుల్. మూడు విభిన్నమైన కథలే. మూడు చోట్లా కొత్త దర్శకులే. ఈసారి ఎలాగైనా సరే, ఇండ్రస్ట్రీలో నిలబడిపోవాలన్న కసి.. రాహుల్ లో గట్టిగానే కనిపిస్తోంది. అయితే కేవలం హీరోగానే చేయాలన్న రూల్సేం పెట్టుకోలేదు రాహుల్. ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ పాత్రలూ చేయడానికి సిద్ధమే అంటున్నాడు. ‘భజే వాయు వేగం’ అందులో భాగంగా చేసిన కథే. ‘హ్యాపీడేస్‌తో’ చిత్రసీమలో అడుగుపెట్టిన వాళ్లెవరూ ఇప్పుడు ఖాళీగా లేరు. ఆ జాబితాలో.. రాహుల్ కూడా చేరిపోతాడేమో చూడాలి.