సాహితీ ప్రపంచంలో కథలకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రతీరోజూ ఎన్నో కథలు పుడుతుంటాయి. అందులో కొన్ని ప్రచురణ వరకూ వెళ్తాయి. అలాంటి కథల్ని పాఠకులకు పరిచయం చేయాలన్నదే ‘కథాకమామిషు’ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయాణంలో మరో వారం గడిచిపోయింది. కొత్త కథలతో.. ‘ఆదివారం’ అనుబంధాలు సిద్ధమయ్యాయి. ప్రధాన పత్రికల్లో ప్రచురితమైన కథల్ని సూటిగా, క్లుప్తంగా విశ్లేషించుకొంటే…
కథ: వంటొచ్చిన మొగుడు
రచన: పద్మావతి చలంచర్ల
పత్రిక: ఈనాడు
ఈనాడు మొదట్నుంచి సంప్రదాయబద్ధమైన కథలకే పెద్దపీట వేస్తుంటుంది. సున్నితమైన హాస్యం, వ్యంగ్యం… వీటినెందుకో ఆదమరచిందన్న కంప్లైంట్ పాఠకుల్లో ఉంది. ‘వంటొచ్చిన మొగుడు’తో అలాంటి వాళ్లని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. టైటిల్ తోనే కథేమిటో చెప్పేశారు రచయిత్రి. వంటొచ్చిన మొగుడు ఉంటే ఆ ఇల్లాలు ఎన్ని అవస్థలు పడాల్సివస్తుందో సరదాగా ఆవిష్కరించారు ఇందులో. ఓ విజయవాడ అమ్మాయి కథ ఇది. హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకొని, హాయిగా మెట్రో సిటీలో సెటిలైపోవాలని కలలు కంటుంది. అలాంటి అమ్మాయికి నిజంగానే హైదరాబాద్‌లో సంబంధం ఖాయం అవుతుంది. కుర్రాడు సాఫ్ట్ వేర్, పైగా వంటొచ్చు. దాంతో ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లికి ‘ఎస్’ అంటుంది. మొదట్లో వీళ్ల కాపురం బాగానే ఉంటుంది. అయితే మొగుడి అతి చేష్టల వల్ల, ఆ భార్యామణిలో చిరాకు, అసహనం, కోపం పెరుగుతూ పోతాయి. అయితే ఈ తతంగం అంతా సరదాగానే సాగిపోతుంది. కథలో పెద్ద పెద్ద సందేశాలేం లేవు. ముగింపు కూడా సింపుల్‌గా ఉంటుంది. యూ ట్యూబ్ పోగ్రాం కోసం వంట చేస్తూ, బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇస్తున్న రన్నింగ్ కామెంట్రీలా సంభాషణలు సాగిపోతుంటాయి. కొత్త తరహా వంటలు, వండే విధానాలూ పరిచయం అవుతాయి ఈ కథ చదివితే! ముఖ్యంగా ‘మంగళం’ అనే వంట విధానానికి అర్థం తెలుస్తుంది.
కథ: నేలపట్టు
రచయిత: ఈతకోట సుబ్బారావు
పత్రిక: సాక్షి
పులికాట్ సరస్సుకు ఎక్కడెక్కడి నుంచో పక్షలు సంతాన ఉత్పత్తి కోసం వస్తుంటాయి. నాలుగైదు నెలలు అక్కడే ఉంటాయి. మళ్లీ తిరిగి వెళ్లిపోతాయి. ప్రతీ యేటా ఇదే తీరు! అయితే అక్కడే పుట్టి, అక్కడే పెరిగిన వాళ్లు మాత్రం ఉద్యోగాల పేరుతో విదేశాలు వలస వెళ్లిపోతున్నారు. పక్షులకు ఉన్న ప్రేమ, మమకారం మనుషులకు లేదేంటి? అనే ప్రశ్న ‘నేలపట్టు’ కథకు మూలం. చంద్రశేఖరం అనే ఆదర్శవంతమైన వ్యక్తి కథ ఇది. పుట్టిన ఊరంటే ప్రేమ, ఇష్టం, గౌరవం. అందుకోసం తన కుటుంబాన్నే కాదనుకొనే వ్యక్తిత్వం. ‘నేలపట్టు’ అనే ఊరి కోసం అతనేం చేశాడు? అనే ఇతి వృత్తం చుట్టూ ఈ కథ నడుస్తుంది. పులికాట్ సరస్సు చరిత్రకు ఓ మినీ డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. అక్కడకు వచ్చే పక్షులు, వాటి పేర్లు చదువుతుంటే.. ఆ సరస్సుపై గౌరవం, ప్రేమ కలుగుతాయి. ముగింపు హృదయాన్ని హత్తుకొనేలా ఉంది. భాష సరళంగా ఉంది. కొన్ని పోలికలు నచ్చుతాయి. ఇంకొన్ని చోట్ల.. ఓవర్ డ్రమటిక్‌గా అనిపిస్తాయి. మొత్తానికి పచ్చదనం, ప్రకృతి పారవశ్యం నిండిన కథ ఇది.
కథ: కంచె
రచన: తాడిమేటి శ్రీదేవి
పత్రిక: నమస్తే తెలంగాణ
వేశ్యా వృత్తి చుట్టూ నడిచే కథలు ఇది వరకు చాలా వచ్చాయి. ‘కంచె’ కూడా అలాంటిదే. కాకపోతే.. ఈ కథలో కొన్ని ఉత్తమమైన, ఉదాత్తమైన పాత్రలు కనిపిస్తాయి. ముఖ్యంగా గంగవ్వ. చుట్టూ ఇంతింత కుళ్లూ, కుతంత్రాలూ ఉన్న ఈ సమాజంలో గంగవ్వలాంటి వాళ్లు ఉంటారా? అనేంత ఆశ్చర్యమేస్తుంది. ఉంటే బాగుణ్ణు అనే కోరిక కలుగుతుంది. తోడ బుట్టిన కూతుర్నే, డబ్బు కోసం వేశ్యా వృత్తిలోకి దింపిన కసాయి తండ్రులున్న ఈ సమాజంలో, అసలు ఎలాంటి సంబంధం లేనివాళ్ల కోసం కొన్ని అనిర్వచనీయమైన త్యాగాలు చేసే గంగవ్వ లాంటి వాళ్లూ ఉంటారన్న నిజం… మంచి, మానవత్వం లాంటి పెద్ద పెద్ద మాటలపై కాస్తింత నమ్మకాన్ని కలిగిస్తాయి. ఈ కథ నిండా బాధలూ, కన్నీళ్లే. కానీ ఎక్కడో ఓ చోట కాసింత స్వాంతన కలుగుతుంది. గంగవ్వ లాంటి పాత్రల వల్ల.
కథ: మేడ మీద గది
రచన: ఈదర శ్రీనివాసరెడ్డి
పత్రిక: వెలుగు
మధ్యతరగతి జీవితాలు, అందులోని బరువు బాధ్యతల గురించి ఎన్ని కథలు చెప్పుకొన్నా తక్కువే. ఇల్లు, సంసారం, పిల్లలూ… ఈ లెక్కలేసుకొనేలోపే జీవితం ముగిసిపోతుంది. ఎన్నో కలలు, ఆ కలల్ని బాధ్యతలు.. ఇంతకు మించి ఏ మధ్యతరగతి పుస్తకంలోనూ పెద్దగా ట్విస్టులుండవు. ‘మేడ మీద గది’ కూడా అలాంటి కథే. మేడమీద గదిని కట్టుకొందామనుకొనే ఓ మధ్యతరగతి జీవి చిరకాల కోరిక ఈ కథ. ఆ కోరిక ఎలా వాయిదాలు పడుతూ వచ్చింది, చివరికి ఏ రూపంలో ఆ కల నెరవేరిందన్నదే ఈ కథ. సాదా సీదా మధ్యతరగతి జీవులందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇల్లు. కాబట్టి.. ఈ కథకూ చాలామంది కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా జీవిత చరమాంకంలో ఉన్న దంపతులు.
– అన్వర్