బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో టాలీవుడ్ నటి హేమ కీరోల్ పోషించారా..? అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరణ తర్వాతే ఈ కేసులో సీసీబీ పోలీసులు హేమను అరెస్ట్ చేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇటీవల హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ పాజిటివ్ అని తేలడంతో బెంగళూరు వచ్చిన పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహర జైలుకు తరలించడం చర్చనీయాంశం అయింది.
రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హేమ డుమ్మా కొట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు హేమను అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో డ్రగ్స్ పాజిటివ్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా వారిని అరెస్ట్ చేయకుండా హేమను మాత్రమే అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో ఆమె పాత్ర కీలకమనే టాక్ వినిపిస్తోంది.
ఈ కేసులో ఇప్పటివరకు హేమతోపాటు ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేసిన పోలీసులు…ఈ రేవ్ పార్టీ నిర్వహణలో హేమ పార్ట్నర్ గా ఉండటంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతోనే హేమను అరెస్ట్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.