పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వచ్చిన సీట్లపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా అనుకున్న సీట్లను సాధించలేదని ఆయన ఫీలయ్యారు.
తెలంగాణలో కనీసం పదమూడు స్థానాలను కాంగ్రెస్ హైకమాండ్ ఆశించింది. రేవంత్ రెడ్డి కూడా అన్ని సీట్లు తీసుకొచ్చి చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎనిమిది సీట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 సీట్ల దామాషాను చూసుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9 సీట్లు దక్కుండాలి. 13 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు. అయితే చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చేతులెత్తేయడంతో బీజేపీకి వరంగా మారింది. దాంతో బీజేపీ పుంజుకుని ఎనిమిది సీట్లకు పెరిగింది. కాంగ్రెస్ పరువు మాత్రం నిలిచింది.
రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి మప్పు ఉంటుందన్న ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెల్చుకోలేకపోవడం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమే. తనపై కుట్ర చేశారని రేవంత్ ఆరోపణలు చేసినా.. ఫలితమే హైకమాండ్ చూస్తుంది. అయితే రేవంత్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ ఉండకపోవచ్చు. కాన ఆయన మాటల్ని హైకమాండ్ గుడ్డిగా నమ్మే అవకాశం ఉండదని.. ఇతర నేతలకు ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు.