అక్షర యోధుడు రామోజీ రావుకు తెలుగు రాష్ట్రాలు కన్నీటి వీడ్కోలు పలికాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి 9 : 30 గంటలకు ప్రారంభమైన అంతిమ యాత్ర ఫిలిం సిటీలోని స్మృతివనం వరకు కొనసాగనుంది. ఆయన తన స్మారక కట్టడాన్ని ముందే నిర్మించుకోవడంతో అక్కడే రామోజీరావు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
ఈ అంతిమ యాత్రలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మీడియా రంగానికి చెందిన ప్రముఖులు సైతం పాల్గొని రామోజీ రావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. రామోజీరావును కడసారి చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలి రావడంతో అంతిమ యాత్ర కొనసాగిన దారులన్నీ జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి.
దారిపొడుగునా అక్షర యోధుడి కృషిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు ఆర్పించారు. రామోజీ రావు ప్రయాణం అనన్య సామాన్యం అంటూ కీర్తించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ఆదేశించడంతో పోలీసుల గౌరవ వందనం అనంతరం స్మృతి వనం వద్ద రామోజీ రావు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.