కేంద్రమంత్రి వర్గం మరికొద్దిసేపట్లో కొలువు తీరనుంది. మోడీ 3.0లో ఎవరెవరుంటారు…? సంకీర్ణ ప్రభుత్వంలో మోడీ ఎవరిని కేంద్రమంత్రులుగా తీసుకుంటారు…? కీలక పార్టీలుగా ఉన్న టీడీపీ, జేడీయూలకు ఎన్ని మంత్రిపదవులు దక్కబోతున్నాయి…? ఇలా రకరకాల చర్చలు సాగాయి. వాటన్నింటికీ పుల్ స్టాప్ పడింది.
కేంద్రమంత్రివర్గంలో టీడీపీ నుండి ఇద్దరికి చోటు దక్కింది. ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకొని, పార్లమెంట్ లో ఆంధ్రావాణిని బలంగా వినిపించే రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. 2014 నుండి రామ్మోహన్ నాయుడు అపజయం లేకుండా శ్రీకాకుళం నుండి గెలుస్తూ వస్తున్నారు. ఇక మరోమంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు చోటు దక్కింది. కిందిస్థాయి నుండి ఎదిగి, దేశ-విదేశాల్లో మంచి పేరుతెచ్చుకోవటంతో పాటు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న పెమ్మసాని వైపు చంద్రబాబు కూడా మొగ్గుచూపారు. ఇక ఏపీ నుండి బీజేపీ నుండి గెలిచిన పురందేశ్వరికి ఛాన్స్ దక్కుతుందని అంతా అనుకున్నా, నరసాపురం నుండి గెలిచిన శ్రీనివాసవర్మకే ఛాన్స్ దక్కింది.
ఇటు తెలంగాణ నుండి అందరూ అనుకున్నట్లే కిషన్ రెడ్డితో పాటు సెకండ్ టైం ఎంపీగా గెలిచి…ఢిల్లీ నాయకత్వం దృష్టిలో మంచిపేరున్న బండి సంజయ్ కు ఛాన్స్ దక్కింది. వీరిద్దరూ ఒకే కారులో ప్రధానితో మీటింగ్ కు వెళ్లారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుండి మొత్తంగా 5బెర్త్ లు దక్కినట్లయింది.
తొలివిడతలో 50మందితో మోడీ కేబినెట్ కూర్పు రెడీ అయ్యింది. అయితే, భవిష్యత్ లో జరిగే విస్తరణలో ఏపీ, తెలంగాణ నుండి ఒక్కొక్కరికీ కనీసం సహయపదవి అయినా దక్కే అవకాశం ఉంది.