టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ అద్భుతం చేసింది. 119 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొంటూ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ని మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాక్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులతో గెలుపు దిశగా వడి వడిగా అడుగులేస్తున్న నేపథ్యంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి, క్రమం తప్పకుండా పాక్ వికెట్లను తీయడంతో గెలుపు ముంగిట పాక్ బోల్తా పడింది. కేవలం 113 పరుగులే చేయగలిగవింది. దాంతో భారత్ 6 పరుగుల తేడాతో అనూహ్యమైన విజయాన్ని అందుకొంది.
బౌలర్లకు అనుకూలించే న్యూయార్క్ పిచ్‌పై టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకొంది. కోహ్లీ, రోహిత్‌లు తొందరగా అవుట్ అయినప్పటికీ పంత్ భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకలా నిలిచాడు. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. దాంతో భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం అనుకొన్నారు. అయితే పాక్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో భారత్ 119 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన పాక్ కాస్త క్రమిశిక్షణతో బ్యాటింగ్ చేసింది. ఓదశలో భారత్ ఓడిపోవడం ఖాయం అనుకొన్నారు. కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ (4 ఓవర్లలో 19) పొదుపుగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, అక్షరదీప్ చెరో వికెట్ చేజిక్కించుకొన్నారు. పాక్ తన తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో పాక్‌కు సూపర్ 8 అవకాశాలు సన్నగిల్లితే, భారత్ సూపర్ 8 ప్రయాణంలో ముందడుగు వేసింది.