”కోపం వస్తే మండుటెండ…
మనసు మాత్రం వెండి కొండ…”
– బాలకృష్ణ సినిమాకూ, ఈ పాటకూ సంబంధం లేదు కానీ, ఈ చరణాలు సరిగ్గా బాలయ్య వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. తిక్క రేగితే తిడతాడు, అది నెత్తికెత్తితే కొడతాడన్నది ఎంత నిజమో, మనసుకు నచ్చితే అంతే స్వచ్ఛంగా మనుషుల్ని ప్రేమిస్తాడు అనేదీ అంతే నిజం. అదే అభిమానులకూ నచ్చుతుంది. అందుకే ఆయనంటే అంత పిచ్చి.
బాలయ్య అంటే భళా.. బాలయ్య అంటే భోళా.
చూడ్డానికి గంభీరంగా కనిపిస్తాడు. కదిలిస్తే చిన్నపిల్లాడైపోతాడు.
అందంలో, ఆహార్యంలో, అభినయంలో, వాచకంలో, నృత్యంలో, నిత్యం కొత్తదారుల్ని ఆవిష్కరించడంలో బాలయ్యకు తిరుగులేదు.
మాస్, యాక్షన్, ఫిక్షన్, ఫ్యాక్షన్, ఫాంటసీ, హిస్టరీ… ఇలా బాలయ్యకు లొంగని జోనర్ లేదు. నందమూరి తారక రామారావు తరవాత అన్ని జోనర్లనీ టచ్ చేసిన స్టార్ హీరో అతనే. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు మన బాలయ్య.
కత్తి పట్టాలన్నా బాలయ్యే, గుర్రమెక్కి కదం తొక్కాలన్నా బాలయ్యే.
మాస్ డైలాగులు చెప్పాలన్నా, గళమెత్తి ఓ పద్యం అందుకోవాలన్నా.. బాలయ్యే!
ఈ వైవిధ్యం ఇంకెవరికీ సాధ్యం కాదేమో..!!
ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన బాలకృష్ణ – ప్రయోగాలకు వెనుకంజ వేయలేదు. ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’… ఇవన్నీ అప్పట్లో ప్రయోగాలే. ఫ్యాక్షన్ కథలతోనూ ఇండ్రస్ట్రీ రికార్డుల్ని కొట్టొచ్చు అని నిరూపించిన యాక్షన్ హీరో బాలయ్య. ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షన్ రుచి, స్టామినా ఏమిటో టాలీవుడ్ కి చెప్పాడు. ఆ తరవాత అంతా బాలయ్యను ఫాలో అయ్యారు. చిత్రసీమ అంతా మాస్, యాక్షన్ గోలలో కొట్టుకుపోతున్నప్పుడు ‘శ్రీరామరాజ్యం’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి కళాత్మక చిత్రాల్లో నటించడానికి సాహసించిన హీరో. అందుకే బాలయ్య అంటే అంత అభిమానం.
ఓసారి, ఓ దర్శకుడ్ని నమ్మాడంటే… ఆ దర్శకుడ్ని ఫాలో అయిపోవడమే తన పని.
తొడ గొట్టమన్నా కొడతాడు, ట్రైన్లని వెనక్కి పంపమన్నా పంపుతాడు.
నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అంతే.
బాలయ్య చేసిన కొన్ని సీన్లు సరదాగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. ట్రోలింగ్కి గురవుతాయి. కానీ వాటిని కూడా అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ‘ఇలాంటివి చేయాలన్నా మన బాలయ్యే’ అని కాలర్ ఎగరేస్తారు. ఆడియో ఫంక్షన్లలో బాలయ్య స్పీచులు సైతం వాళ్లకు ఎంటర్టైన్ ఇస్తుంటాయి. మనసులో ఉన్నది మాట్లాడేయడం బాలయ్య స్పెషాలిటీ. వాటికి గ్రామర్ ఉండాల్సిన పనిలేదు అనేది బాలయ్య మెంటాలిటీ. తనని ట్రోల్ చేయడానికి కొంతమంది ఎదురు చూస్తుంటారు అని తెలిసినా బాలయ్య తన స్వభావం వదల్లేదు. ‘నవ్వేవాళ్లు నవ్వనీ, ఏడ్చేవాళ్లు ఏడ్వనీ.. డోంట్ కేర్’ అంటూ బాలయ్య సినిమాలో ఓ పాటుంది. అదే ఆయన లక్షణం కూడా.
బసవతారకం ఆసుపత్రి బాలయ్యలోని మరో ఉదాత్తమైన కోణం. ఆ ఆసుపత్రి ద్వారా ఎంతమంది ప్రాణాల్ని కాపాడాడో లెక్కలేదు. సైలెంటుగా చేసే సేవా కార్యక్రమాలకు పద్దు లేదు. హిందూపురంలో వరుసగా మూడు సార్లు గెలిచి – రాజకీయ రంగంలోనూ విజయ పతాక ఎగరేశాడు బాలయ్య. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు కూడా ‘నేను మీ అభిమానిని సార్’ అంటే చాలు, వాళ్ల సినిమాల ప్రమోషన్ల రంగంలో దిగిపోతాడు. అక్కడ ఈగోలు, స్టార్డమ్లూ అడ్డు రావు.
పాతికేళ్ల వయసులో బాలయ్యని చూడండి. ఇప్పటి బాలయ్యని చూడండి.
ఎక్కడా తేడా లేదు. అదే జోష్… అదే స్పీడ్. ఆ మాటకొస్తే అంతకంటే కొంచెం ఎక్కువే.
వయసు శరీరానికే కానీ, మనసుకు కాదు. బాలయ్య ఈ మాటల్ని నిజం చేశాడు. ఇది వరకటికంటే స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. సినిమాలేనా, ఇటు బుల్లి తెర షోలు, అటు రాజకీయాలు, మరోవైపు ‘బసవతారకం’ అంటూ సేవా కార్యక్రమాలు.
ఏం చేసినా, ఎక్కడ ఉన్నా ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది.
ఆ బ్రాండ్ మరో వందేళ్లయినా అలానే ఉంటుంది.
ఎందుకంటే ఆ బ్రాండ్ పేరు… బాలయ్య!
హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ!!!
(ఈరోజు బాలకృష్ణ పుట్టిన రోజు)