కేంద్రమంత్రి వర్గంలో సీనియర్ నేత ఈటల రాజేందర్ కు చోటు దక్కకపోవడంతో ఆయన సేవలను పార్టీ హైకమాండ్ ఎలా వాడుకోనుంది..? ఈటలను ముందుంచి బీఆర్ఎస్ ను మరింత దెబ్బకొట్టాలని కమలదళం భావిస్తోందా…? అంటే అవుననే సమాధానం వస్తోంది.
మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన ఈటలకు మోడీ కేబినెట్ లో చోటు పక్కా అని అంచనా వేసినా…హైకమాండ్ కు అత్యంత విధేయులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈటలకు నిరాశ తప్పలేదు. ఈటలను స్టేట్ చీఫ్ గా నియమించాలనే ఆయన స్థానంలో బండి సంజయ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించడం వలన రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుందనే ముందుచూపుతో హైకమాండ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా.. తెలంగాణలో బీసీ జపం చేస్తోన్న బీజేపీ…ఈటలను అద్యక్షుడిగా నియమించడంతో బీసీల ఓటు బ్యాంక్ ను మరింత పెంచుకోవచ్చునని ప్లాన్ తోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
బీఆర్ఎస్ లోని కీలక నేతలతో ఈటలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలహీనపడుతుండటంతో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ స్కెచ్ వేసింది. దీంతో ఈటలను స్టేట్ చీఫ్ గా నియమించడం వలన పార్టీకి బలమైన నాయకత్వం అందించడమే కాకుండా, బీఆర్ఎస్ నుంచి బలమైన నేతలను బీజేపీలో చేర్చుకోవచ్చుననేది జాతీయ అధినాయకత్వం ప్లాన్. పైగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ… ఈటలకు పగ్గాలు అప్పగిస్తే పార్టీకి క్షేత్రస్థాయి నుంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతోంది. దీంతో కొద్ది రోజుల్లోనే ఈటలకు అద్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.