కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్రాల నుంచి ఎవరెవరికి ప్రాతినిధ్యం దక్కుతుంది అనే ఉత్కంఠకు తెరపడగా… ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు కేబినెట్ పైనే పడింది. ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఆరోజు ఆయనతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు అని చర్చ జరుగుతోంది.
జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా చంద్రబాబు కేబినెట్ కూర్పు ఉండనుండటంతో ఏ జిల్లా నుంచి ఎవరికి బెర్త్ కన్ఫాం అవుతుందని ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నుంచి ప్రధానంగా సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాస్ , కన్నా లక్ష్మీనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, వంగలపూడి అనిత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి , కొణతాల రామకృష్ణ , కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఆనం.. తదితరుల పేర్లు ప్రముఖంగా మంత్రిపదవుల రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ సారధ్యంలోని కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీకి ఎన్ని మంత్రి పదవులను కట్టబెడుతారు…? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జనసేన నుంచి పవన్, నాదెండ్ల మనోహర్ కు బెర్త్ ఖాయంగా కనిపిస్తుండగా వారికి ఏ శాఖలను కేటాయిస్తారనేది ఆసక్తి రేపుతోంది. పవన్ కు డిప్యూటీ సీఎం అనే ప్రచారం నేపథ్యంలో ఆయనకు ఎలాంటి పదవి దక్కుతుందోనని సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.
కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం దక్కడంతో అందుకు అనుగుణంగా బీజేపీకి రాష్ట్ర మంత్రివర్గంలో చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దాంతో బీజేపీ నుంచి ఎంతమందిని చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకుంటారు అని చర్చిస్తున్నారు. బీజేపీ నుంచి ప్రధానంగా కామినేని శ్రీనివాస్ తోపాటు సుజనా చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా వారితో పాటు అదనంగా మరెవరికి అయినా ఛాన్స్ లభిస్తుందా..? అనే సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీ కేబినెట్ పైనే నెలకొంది.