ఏపీ నుంచి బీజేపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రాధాన్యతల క్రమంలో చూసుకుంటే మొదటి పేరు పురందేశ్వరి… తర్వాత సీఎం రమేష్.. ఆ తర్వాత శ్రీనివాసవర్మ ఉంటారు. కానీ బీజేపీ హైకమాండ్ విచిత్రంగా ఆలోచించింది. శ్రీనివాసవర్మకే కేంద్ర మంత్రి పదవి ప్రకటించింది. ఆయన సహాయ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఆయనకు ఎందుకు కేంద్ర పెద్దలు ప్రాధాన్యమిచ్చారన్నది సంచలనంగా మారింది.
పురందేశ్వరికి సహాయమంత్రి ఆఫర్ చేయలేని పరిస్థితి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి మొదటి చాయిస్ గా పదవి ఇవ్వాల్సింది. కానీ ఏపీ నుంచి టీడీపీకి ఒక కేబినెట్ ర్యాంక్ కేటాయించాల్సి వచ్చింది. పొత్తులో భాగంగా అతి తప్పలేదు. ఆ పోస్టును సిక్కోలు యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. దీంతో ఒకే రాష్ట్రానికి రెండో కేబినెట్ హోదా ప్రకటించే అవకాశం లేదు. పురందేశ్వరి గతంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేశారు. ఇప్పుడు సహాయ మంత్రి పదవి ఇవ్వడం ఆమె స్థాయిని తగ్గించినట్లే అవుతుంది. అందుకే పురందేశ్వరి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు.
సీఎం రమేష్‌కు టీడీపీ ముద్రే మైనస్
సీఎం రమేష్ స్వతహాగా టీడీపీ నేత. ఆయన గత ఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీలో చేరారు. తనదైన ఎలక్షనీరింగ్ నైపుణ్యాలతో హైకమాండ్ ను ఆకట్టుకున్నారు. ఆయన మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడు. కానీ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే విషయంలో మోదీ, షా తమకు సన్నిహితులు అనే కారణాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు. ఇతర విషయాలు తీసుకున్నారు. ఫలితంగా ఆయన పేరు వెనుకబడిపోయిందని తెలుస్తోంది. దానికి టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఏపీ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలే కీలకం అనుకోవచ్చు.
శ్రీనివాసవర్మకు పదవి ద్వారా బీజేపీ కింది స్థాయి కార్యకర్తలకు సందేశం
ఏపీలో పొత్తుల్లో టిక్కెట్ల కేటాయింపు తర్వాతా అన్నీ ఒక్క గ్రూపుకే ప్రాధాన్యం లభించిందన్న సంకేతాలు వచ్చాయి. సీనియర్లను పక్కన పెట్టారని అనుకున్నారు. వలస నేతలకు టిక్కెట్లను ఇవ్వడం.. కాస్త ప్రో వైసీపీ నేతలుగా ముద్ర పడిన ఎవరికీ చాన్స్ ఇవ్వకపోవడంతో ఈ అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఈ ముద్రను చెరిపేయడానికి.. కిందిస్థాయి నుంచి పని చేసే కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి శ్రీనివాసవర్మకు చాన్సిచ్చారని చెబుతున్నారు. ఆయనకు పదవి ఖరారు కాగానే సోము వీర్రాజుతో సంతోషం పంచుకునే వీడియో రిలీజ్ చేయడం ఇందులో భాగమేనని భావిస్తున్నారు. కాలం కలసి వస్తే వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రిగా అయిపోవచ్చని వర్మ నిరూపించారు.