ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంత కాలం ఏపీ మందు బాబుల్ని అడ్డగోలుగా దోచుకున్న జే బ్రాండ్ మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. పాపులర్ బ్రాండ్లను అమ్మకానికి పెడుతున్నారు. కింగ్ ఫిషర్ బీర్ అనే మాటే ఐదేళ్ల పాటు ఎక్కడా వినిపించలేదు. ఇప్పుడు కింగ్ ఫిషరే కాదు కార్ల్స్ బెర్గ్ సహా ప్రముఖ బ్రాండ్లన్నీ ఏపీలో దర్శనమిస్తున్నాయి. మందుబాబులు ఖుషీ అవుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధం పేరుతో పాలసీ మార్చి… మొత్తం మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తయారీ నుంచి రవాణా, అమ్మకం మొత్తం తన గుప్పిట్లోనే ఉండేలా పెట్టుకోవడంతో కొండంత అవినీతి జరిగింది. కొన్ని డిస్టిలరీలను లీజు పేరుతో లాక్కుని ఈ దందా నడిపారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పంపిణీకి ఉపయోగించుకున్నారు. వేల కోట్లు దోచుకున్నారు. ఈ వ్యవహారంపై స్పష్టమైన సమాచారం ఉండటంతో టీడీపీ గెలవగానే .. ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. జే బ్రాండ్ మద్యం నిలివేయాలని ఆదేశించింది. వెంటనే అధికారులు ఇతర ప్రముఖ కంపెనీల డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారు.
కోడ్ కూడా ముగియడంతో ఇప్పటికే చంద్రబాబు అనధికారికంగా కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. అమరావతి నిర్మాణాలు ప్రారంభం కావడంతో పాటు మద్యం, గనుల విషయంలో జరుగుతున్న దోపిడీని నిలిపివేయడానికి చర్యలు తీసుకున్నారు. మద్యం పాలసీ మార్చి.. మళ్లీ దుకాణాలకు లైసెన్స్ ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయి.