విశాఖ కేంద్రంగా వైసీపీ నేతల అక్రమాల గుట్టు తేల్చేందుకు కొత్త ప్రభుత్వం రెడీ అయిందా.? విశాఖలో భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారని తాజాగా ఫిర్యాదులు అందటంతో కొత్త సర్కార్ ఆపరేషన్ వైజాగ్ చేపడుతుందా..? ఈ పరిణామాలతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందా..?అంటే అవుననే సమాధానం వస్తోంది.
విశాఖలో వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు చేస్తే దాడులకు తెగబడుడుతారని భయంతో బాధితులు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది లేదు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ అక్రమాలపై బాధితులు ఒక్కొక్కరు ఫిర్యాదులు చేస్తుండటంతో వైసీపీ హయంలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్క తేల్చాలని కొత్త సర్కార్ ఫిక్స్ అయింది. దీంతో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారుల వెన్నులో వణుకు మొదలైంది.
విశాఖలో ఎప్పుడో కేటాయిచిన రేడియంట్ భూములు, ప్రభుత్వ భూకేటాయింపులు జరిపిన బే పార్క్ హోటల్, రాడిసన్ హోటల్ యజమానులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి వైసీపీ అనుకూల పారిశ్రామిక వేత్తలు వాటాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి.అలాగే ఎన్నికలకు ముందు విశాఖ పరిధిలో అసైన్డ్ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని, వారికి ఉన్నతాధికారులు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఇక, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వైసీపీ కీలక నేత కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్ళడంతో పెద్ద ఎత్తున నిధుల గోల్ మాల్ చోటు చేసుకుందని టీడీపీ ఆరోపించింది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో విశాఖలో వైసీపీ నేతల అక్రమాలపై బాధితులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో విశాఖ కేంద్రంగా జరిగిన అవినీతి, అక్రమాలపై కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టనుండటంతో తమ బాగోతం బయటపడుతుందని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైనట్లుగా చర్చ జరుగుతోంది.