మోదీ 3.0లో రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం ముఫ్పై మంది కేబినెట్ ర్యాంకు మినిస్టర్స్లో ఆయన అత్యంత చిన్న వయస్కుడు. మొత్తం కేబినెట్ లో కూడా చిన్న వయస్కుడే. అయితే ఆయనకు అత్యంత కీలకమన శాఖనే లభించే అవకాశాలు ఉన్నాయి. రైల్వే శాఖను కేటాయిస్తారని ఢిల్లీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యమైన శాఖల్లో ఒకటి. అలాగే క్లిష్టమైనది కూడా.
రైల్వే శాఖ ప్రస్తుతం సంస్కరణల పథంలో ఉంది. వందే భారత్ తో పాటు బుల్లెట్ రైలు వంటి భవిష్యత్ ఆశలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటి సమయంలో రామ్మోహన్ నాయుడు వంటి యంగ్ అండ్ డైనమిక్ అయితే అన్నీ సజావుగా సాగిపోతాయని మోదీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలో దక్షిణాదికి రైల్వేశాఖ కేటాయించిన సందర్భాలు లేవు. ఈ కారణంగా కూడా రైల్వే శాఖ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా.
రామ్మోహన్ నాయుడుకు రైల్వే శాఖ కేటాయిస్తే.. విశాఖ రైల్వే జోన్ పూర్తయిపోతుంది. 2019 ఎన్నికలకు ముందే కేంద్ర కేబినెట్ విశాఖ రైల్వే జోన్ ప్రకటించింది. వైసీపీ హయాంలో ఒక్కఅడుగు ముందుకు పడలేదు. స్థలం అడిగినా ఇవ్వలేదని కేంద్రం ఆరోపించింది. ఇప్పుడు రామ్మోహన్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరే అవకాశం ఉంది.