కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటు లేకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పవన్ కల్యాణ్‌తో బీజేపీ అగ్రనేతలు చర్చించారని అంటున్నారు. మిత్రపక్షాలకు కేబినెట్లో చోటు కల్పించడంపై కొన్ని మార్గదర్శకాలు పెట్టుకున్నారని ఆ ప్రకారమే జనసేన కు చోటు కల్పించలేకపోయారని భవిష్యత్ లో రాజకీయ పరిణామాలను బట్టి పరిశీిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఐదుగురు ఎంపీలు అంత కంటే ఎక్కువ ఉన్నవారికి ఓ కేబినెట్ ర్యాంక్ పదవి, తక్కువ ఉన్న వారికి ఓ సహాయ మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు. ఒకటి, రెండు ఎంపీలు ఉన్న పార్టీలకు ఆయా పార్టీల అధ్యక్షులకు అయితే ఇవ్వాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీని చీల్చి ఆయన పార్టీని బీజేపీ సాయంతో లాగేసుకున్న అజిత్ పవార్ పార్టీకి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. సహాయ మంత్రి పదవి ఇస్తామంటే వద్దన్నామని అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. కానీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయలేదని బీజేపీ వర్గాలంటున్నాయి.
పవన్ కల్యాణ్ కూడా తమకు కేంద్రకేబినెట్‌లో చోటు ఉండాలని పట్టుబట్టలేదని తెలుస్తోంది. తమకు పదవులు ముఖ్యం కాదని ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారని అంటున్నారు. అప్పటికే ఏపీ నుంచి కేబినెట్ ర్యాంక్ తో పాటు ముగ్గురికి కేంద్ర మంత్రులుగా చాన్సిచ్చినందున… జనసేన పార్టీకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నారు.