కింది నుండి వచ్చి, గ్రౌండ్ రియాల్టీ తెలిసిన నాయకులు పాలనలో తీసుకునే జాగ్రత్తలు వేరుగా ఉంటాయి. అధికారుల నుండి రాంగ్ మూవ్ ఉన్నా, వెంటనే తేరుకొని సరి చేసుకుంటారు. అలాంటి నాయకుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరు.
గ్రౌండ్ రియాల్టీకి దగ్గరగా తన నిర్ణయాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా… రేవంత్ గ్రౌండ్ రియాల్టీకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు. తను సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టెట్ నిర్వహణ సహా పలు నిర్ణయాల్లో ప్రజల మూడ్ మేరకు వెనక్కి తగ్గారు. శభాష్ అనిపించుకున్నారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం బద్నాం అయిన ముఖ్యమైన అంశాల్లో లిక్కర్ బ్రాండ్స్ ఒకటి. ఎన్నడూ వినని పేర్లతో మద్యం షాపుల్లో మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. యూనివర్సల్ బ్రాండ్స్ లేక కల్తీ మద్యం అమ్ముతున్నారన్న చెడ్డపేరు మూటగట్టుకున్నారు. ఏపీ ప్రజలు కూడా తెలంగాణలో రెగ్యూలర్ బ్రాండ్స్ దొరుకుతుంటే ఏపీలో ఎందుకు అమ్మరు అనే ప్రశ్న లేవనెత్తారు.
కానీ, ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్స్ అయ్యింది. ఏపీలో కనపడిన బ్రాండ్స్ అన్నీ క్రమంగా ఒక్కోటి తెలంగాణ మద్యం షాపుల్లో దర్శనమిస్తున్నాయి. బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, హంటర్, బిర్యానీ ఇలా కొత్త పేర్లతో బీర్ల బ్రాండ్స్ వచ్చాయి. అదే సమయంలో ఏపీలో సర్కారు మారగానే 5 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు చూడని కింగ్ ఫిషర్ బ్రాండ్స్ ఏపీలో లారీలకు లారీలు దిగుతున్నాయి.
ఏపీలో జగన్ ఈ బ్రాండ్స్ తో రాజకీయంగా దెబ్బతిన్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, ఎక్సైజ్ శాఖ సీఎంను రాంగ్ రూట్ లో గైడ్ చేస్తుందా… లేదంటే ఆదాయ మార్గంగా మల్చుకునే క్రమంలో రేవంత్ రిస్క్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ బ్రాండ్స్ విషయంలో రేవంత్ వెనక్కి తగ్గకపోతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం వినిపిస్తుంది.