కెరీర్ ముందు నుంచీ కథనే నమ్ముకొని ప్రయాణం చేస్తున్న మెగా హీరో వరుణ్‌తేజ్. ఈ క్రమంలో కొన్ని ప్రయోగాలూ చేశాడు. ఎదురు దెబ్బలూ తిన్నాడు. గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వరుణ్ తేజ్నమ్మకాన్ని దారుణంగా దెబ్బకొట్టాయి. మూడు సినిమాలూ ఆర్థికంగా భారీ నష్టాల్ని చవిచూశాయి. అందుకే తన కెరీర్ విషయంలో వరుణ్ ఇప్పుడు ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఈమధ్య వరుణ్ ఏకంగా 12 కథల్ని రిజెక్ట్ చేశాడు. అన్నీ పెద్ద బ్యానర్ నుంచి వచ్చినవే.
కథలో కొత్తదనంతో పాటు, కమర్షియల్ యాంగిల్ కూడా ఉండాలని దర్శకులకు సూచిస్తున్నాడట వరుణ్‌తేజ్. కొత్తదనం పేరుతో ప్రయోగాలు చేయకూడదని, నిర్మాతలకు నాలుగు డబ్బులు మిగిల్చి, ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించే కథలకే పెద్ద పీట వేయాలని వరుణ్ భావిస్తున్నాడట. నిజానికి ఇది మంచి నిర్ణయమే. ఇంత వరకూ వరుణ్ తనకు నచ్చిన సినిమాలే చేసుకొంటూ వెళ్లాడు. ఇప్పుడు బాక్సాఫీసుకు ఏం కావాలో ఆలోచిస్తున్నాడు. వరుణ్ చేతిలో ఉన్న `మట్కా` కమర్షియల్ గా వెయిటేజ్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. ఇందులో మరింత మసాలా దట్టించడానికి దర్శకుడు కరుణ కుమార్ ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.