టీడీపీ విషయంలో ఎప్పుడైనా రేవంత్ ఒకే అభిప్రాయంతో ఉంటారు. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నామంటేదానిి టీడీపీలో వేసిన పునాదులే కారణమని ఆయన గట్టిగా చెబుతారు. కాంగ్రెస్ పార్టీ లో సీఎంగా ఉండి అలా చెప్పుకుంటున్నారంటే.. ఖచ్చితంగా అది ఆయన గొప్ప వ్యక్తిత్వం. నిజానికి రేవంత్ రెడ్డి చాలా మందిలా టీడీపీ అవకాశాలిస్తే ఎదగలేదు. ఆయన అవకాశాల్ని సృష్టించుకున్నారు.
సొంతంగా జడ్పీటీసీగా.. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచిన రికార్డు ఉంది. ఆ తర్వాతే ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో ఉన్న కొంత కాలమే అయినా ఆయన రాజకీయం నేర్చుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటికీ కృతజ్ఞత చూపుతారు. టీడీపీని ఆయన గౌరవిస్తూనే ఉంటారు. రాజకీయంగా తనపై విమర్శలు వస్తాయని ఎప్పుడూ అనుకోవడం లేదు.
రేవంత్ రెడ్డి కన్నా ముందు కేసీఆర్ అసలు సిసలైన టీడీపీ నేత. ఆయన కాంగ్రెస్ నాయకుడే అయినా.. .. ఎన్టీఆర్ అండతో టీడీపీలో టిక్కెట్ దక్కించుకుని చంద్రబాబు ప్రోత్సాహంతో ఎదిగారు. కానీ కేసీఆర్ తీరు గమనించిన చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తనదారి తాను చూసుకున్నారు. టీడీపీని లేకుండా చేయాలని అనుకున్నారు. తెలంగాణలో అదే పని చేశారు కూడా. త్వరలో టీడీపీ కన్నా ఘోరమైన పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ భజన చేయడం ప్రారంభించారు.
కానీ రేవంత్ మాత్రం.. మొదటి నుంచి ఒకే మాటతో ఉంటూ వస్తున్నారు. టీడీపీ విషయంలో ఆయన అభిప్రాయం ఎప్పుడూ మారలేదు. అలాగే వ్యక్తం చేయాల్సిన సందర్భం వస్తే దాచుకోవడం లేదు.