బిజెపిని ఒక్కడై అధికారంలో ప్రతిష్టించిన నరేంద్రమోదీ ముందు భూసేకరణ సవరణ బిల్లు ముందుక సాగనివ్వని అవరోధమై నిలచింది. జూలై21 నమొదలయ్యే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో ఈ బిల్లు చట్టమయ్యేది ఖాయమన్న వెంకయ్యనాయుడు బుధవారం నీతిఅయోగ్ సమావేశం తరువాత ”చూద్దాం” అనిమాత్రమే చెప్పగలుగుతున్నాయి.
రైతు ప్రయోజనాలను కార్పొరేట్ ప్రయోజనాలకు ఫణంగా పెట్టే ఈ బిల్లుపై బిజెపిలోనే గట్టి వ్యతిరేకత వుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించవలసివున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సవరణబిల్లుకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. తెలంగాణా రాష్ట్రం తటస్ధ వైఖరిని ప్రదర్శిస్తోంది.
ఎట్టిపరిస్ధితుల్లోనూ బిల్లుని ఆమోదించలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రకటించిన నేపధ్యంలో బుధవారం జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవరూ హాజరుకాలేదు. రద్దయిపోయిన ప్రణాళికా సంఘం-ప్లానింగ్ కమిషన్-స్థానంలో ఏర్పడిన మరింత విస్తృతమైన సంస్థ నీతి ఆయోగ్. సమావేశానికి హాజరైన పదహారుమంది ముఖ్యమంత్రులలో ఎనిమిదిమంది భాజపావారు. మరో ఇద్దరు అధికార భాగస్వామ్య పక్షాలకు చెందినవారు. వీరందరూ సవరణలను ఆమోదించి ఉండినట్టయితే సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వాదం బలపడి ఉండేది. అదేమీ జరగలేదు.
ఈ సవరణ బిల్లు గురించి అధ్యయనం చేయడానికి గతంలోనే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సంఘం ఏర్పడి ఉంది. ఈ సంయుక్త సంఘం జరుపుతున్న అధ్యయన సమావేశాలలో పాల్గొన్న స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, వనవాసీ కళ్యాణ్ ఆశ్రయ్ వంటి జాతీయతా సంస్థలు బిల్లును వ్యతిరేకించాయి. ఈసంస్ధలన్నీ బిజెపితో భావస్వామ్యం కల సంస్థలు.
భూమిసేకరణ చట్టాన్ని తమ ప్రయోజనాలకోసం 1894లో బ్రిటిష్ వారు రూపొందించారు. భూమిని ప్రధానంగా వ్యవసాయ భూమిని ప్రభుత్వ కలాపాలకోసం సేకరించడానికి ఈ చట్టం వీలు కల్పించింది. ఈ సేకరణ రైతుల, భూమి యజమానుల అనుమతితో నిమిత్తం లేకుండా జరిగిపోయేది. ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తే చాలు, యాజమాన్యాలు ప్రభు త్వం నిర్ధారించే పరిహారాన్ని తీసుకొని భూమిని అప్పగించవలసిందే. సుపీ్రంకోర్టు ఈ బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని అనేక కేసుల్లో తప్పు పట్టింది. రద్దు చేసి కొత్త చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని సూచించింది.
సర్వోన్నత న్యాయ ప్రమేయం వల్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 2013లో కొత్త చట్టం రూపొందింది. ప్రభుత్వ పథకాలకోసం భూమిని సేకరించే సమయంలో గ్రామానికి చెందిన యజమానులలో డెబ్బయిశాతం అనుమతించిన తరువాతనే సేకరణ జరగాలన్నది 2013 నాటి చట్టంలోని నిబంధన. ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలకు భూమిని కట్టబెట్టడానికై సేకరణ జరిగినట్టయితే 80 శాతం యజమానులు అంగీకరించాలి. లేకుంటే సేకరణ జరుపరాదు. 2013లో తెచ్చిన భూ సేకరణ చట్టం దాదాపు ఏకాభిప్రాయంతోనే వచ్చింది. చట్టంలో కొన్ని లొసుగులున్నప్పటికీ భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల హక్కులను పరిరక్షించే పలు అంశాలు దానిలో ఉన్నాయి. ఏకాభిప్రాయంతో తెచ్చిన చట్టానికి సవరణలపై ఏకాభిప్రాయం సాధించడం బిజెపి ప్రభుత్వ కనీస బాధ్యత.
ఈ అనుమతిని తీసుకోవడం అవసరం లేని విధంగా చట్టంలో ప్రస్తుతం ప్రభుత్వం మార్పులు చేస్తోంది.
బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకముందే ఆర్డినెన్సు ద్వారా సవరణలు అమలులోకి రావడం వైపరీత్యం. అనుమతి నిబంధన రద్దయినట్టయితే 1894 నాటి బ్రిటిష్ వారి చట్టానికి ప్రస్తుత చట్టానికి మధ్య తేడా ఉండబోదన్నది ప్రత్యర్థుల వాదం. ఈ వాదాన్ని నీతీ ఆయోగ్ సమావేశంలో భాజపా ప్రత్యర్ధులు మాత్రమే కాదు అకాలీదళ్ వంటి మిత్రులు కూడ వినిపించారు…
రాజ్యసభలో మెజార్టీ లేకున్నప్పటికీ ఆర్డినెన్స్‌లు తెచ్చి భూ సేకరణ చట్టాన్ని సవరించడం చట్ట సభలను కించపర్చడమే. ఆర్డినెన్స్‌ల పాలన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఎలాగోలా చట్టాన్ని సవరించేందుకు కేంద్రం వేయని ఎత్తు లేదు. ప్రధాని, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి వారు పార్లమెంటులో భూ బిల్లును ఆమోదింపజేసుకుంటామని, అవసరమైతే జాయింట్ పార్లమెంటు భేటీ ఏర్పాటు చేసి పంతం నెగ్గించుకుంటామని పట్టుదలకు పోతున్నారు. గ్రామసభల్లో 80 శాతం మంది అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలని 2013 చట్టంలో ఉంది.
ఆ నిబంధనను సవరిస్తోంది బిజెపి సర్కారు. సేకరించిన భూమి ఐదేళ్లలో వినియోగంలోకి రాకపోతే తిరిగి స్వాధీనపర్చుకొని రైతులకు అప్పగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే క్లాజును ఎత్తేయాలని ప్రతిపాదించారు.
రెండు పంటలు పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించకూడదని 2013 చట్టం చెబుతోంది. ప్రభుత్వ అనుమతి తీసుకొని వ్యవసాయ యోగ్యమైన భూములను సైతం సేకరించొచ్చని బిజెపి సవరణ చేస్తోంది. ప్రభుత్వ అనుమతి ఉంటే చాలు అనేటట్లయితే ఈ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, రియల్ఎస్టేట్ మాఫియా ప్రయోజనాలకే కొమ్ము కాస్తుందని, రైతులు, ఆదివాసీల ప్రయోజనాలను పణంగా పెడుతుందని ఏడాది పాలన చూస్తే అర్థమవుతుంది. ఎందుకోసమైతే భూమి సేకరిం చారో అందుకు వినియోగించకుండా నిబంధనలు ఉల్లం ఘించి దుర్వినియోగం చేసిన వారిపై తీసుకునే చర్యల గురించి 2013 చట్టంలో ఉంది. ఆ క్లాజులను నిర్వీర్యం చేయడానికి బిజెపి సర్కారు నడుంకట్టింది. కొన్ని పరిశ్రమలకే భూమి అనే నిబంధననూ ఎవరికైనా అనే విధంగా సవరిస్తోంది. భూమికి భూమి అనే అంశానికి ప్రాధాన్యం తగ్గిస్తోంది.
భూమి సేకరణ సవరణ బిల్లు విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడినందువల్ల గ్రామీణ ప్రగతి ఆగిపోయిందని మోదీ నీతి ఆయోగ్ సమవేశంలో చెప్పారు ఆరు నెలల ప్రతిష్ఠంభన వల్లనే గ్రామీణ ప్రగతి ఆగిపోతుందా?