పదేళ్లలో పార్లమెంట్ సమావేశాల్లో ఎప్పుడైనా విపక్షం వాయిస్ గట్టిగా వినిపించిందా ? . ప్రధాన ప్రతిపక్షమే లేదు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కాదు. అయినా ఆయన మాట్లాడితే ప్రభుత్వం అనర్హతా వేటు దాకా వెళ్లింది. అదానీ వ్యవహరంలో ఇరుకున పెడుతున్నారని వేటేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ఆధారాలు లేని కేసులు పెట్టి అదే పని చేశారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. అదే ప్రజాస్వామ్యంలో గొప్పతనం. మోదీ మూడో టర్మ్ లో.. పార్లమెంట్లో ప్రతిపక్ష వాయిస్ ఊహించని విధంగా వినిపిస్తోంది.
ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడారు. ఆయన ఏం మట్లాడారు..అందులో బీజేపీ ఏం దురర్థాలు తీసుకుని ప్రచారం చేస్తోంది అన్న విషయం పక్కన పెడితే.. ఆయన ప్రసంగం వైరల్ అయింది. గతంలోనూ ఆయన సభల్లో వైరల్ ప్రసంగాలు చేశారు. కానీ అప్పటికన్నా ఇప్పుడు మరింత ఎఫెక్టివ్ గా జనంలోకి ఆయన స్పీచ్ వెళ్లింది. ఎందుకంటే ఇప్పుడాయన ప్రతిపక్ష నేత. మోదీకి ధీటుగా ప్రజల ముందుకు వస్తున్న నేత. ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే కాదు.. మహువా మొయిత్రా కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు.
బీజేపీ అట్రాసిటీస్ ఎదుర్కొని ఏ మాత్రం.. వెనక్కి తగ్గకుండా నిలబడిన మహిళా నేత మహువా మొయిత్రా. ఆమె స్పీచ్‌లు అంటే…. బీజేపీ నేతలకు వణుకు పుట్టాల్సిందే. గత ఐదేళ్ల కాలంలో ఆమె పోరాట పటిమతో ఎంతో మందికి అభిమాన నేత అయ్యారు. ఆమెపై క్యాష్ ఫర్ క్వశ్చన్స్ అభియోగాలు మోదీ అనర్హతా వేటు వేసి పార్లమెంట్ కు దూరం చేసేశామని అనుకున్నారు. కానీ ప్రజా మద్దతుతో మరోసారి ఎంపీగా అడుగు పెట్టారు. ఇప్పుడామే మరింత పవర్ ఫుల్. ఆమె స్పీచ్ అదే చెప్పింది. ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదని సివంగిలా విరుచుకుపడ్డారు.
ఇది ఆరంభం మాత్రమేనని అనుకోవచ్చు. పార్లమెంట్ లో గతంలోలా ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాలు లేవు. కేంద్రం ఇప్పుడు పార్లమెంట్ లోనూ జవాబుదారీగా ఉండాలి. అంతే కానీ.. గట్టిగా మాట్లాడుతున్నారని వేటేస్తాం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే..ఎన్ని వేధింపులకు గురి చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా లొంగని నేతలు ఎదురుగా నిలబడి ఉన్నారు మరి