అవినీతి ఏ మూలాన ఉన్నా దాని అంతుచూస్తానని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు తగ్గట్టే స్పీడ్ పెంచేశారు. అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. గతంలో తన ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు లంచం తీసుకున్న సర్వేయర్ కు తాజాగా తగిన బుద్ధి చెప్పారు.
తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చిత్తూర్ జిల్లా కడపల్లె పంచాయితీ శివాపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణం చేసేందుకు భూమార్పిడి కోసం టీడీపీ నేతలు దరఖాస్తు చేయగా… డిప్యూటీ సర్వేయర్ 1.80లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. అప్పట్లో అదంతా ఇవ్వడంతో ఆ ఫైల్ ముందుకు వెళ్ళింది.
ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చిన వేళ ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా లంచం తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే మరో రైతు నుంచి సర్వేయర్ లంచండిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటిపై విచారణ చేపట్టి రాత్రి డిప్యూటీ సర్వేయర్ ను సస్పెండ్ చేశారు.
గత ప్రభుత్వంలో జరిగిన మాదిరిగా అవినీతి, అక్రమాలకు తావు ఉండదని చెప్తున్నా చంద్రబాబు.. అవినీతి అధికారుల గుర్తించి వెనువెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నారు.