రెండు రాష్ట్రాలుగా విడిపోయినా… ప్రజలుగా కలిసి ఉండాలి. విభజన సమస్యల పరిష్కారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అంతే తప్పా ప్రజలు ఇబ్బందిపడకూడదు. కానీ, గత 10ఏళ్లుగా వీటికి మోక్షం లేదు. విభజన సమస్యలు పట్టించుకున్న వారే లేరు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో ఇరు రాష్ట్రాల సీఎంలు మంచి స్నేహితులు. అయినా పట్టించుకోలేదు.
అయితే, ఈ నెల 6న భేటీ అవుదాం… అపరిష్కారంగా ఉన్న సమస్యలపై కూర్చొని మాట్లాడుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇందుకు సీఎం రేవంత్ కూడా సానుకూలంగానే ఉన్నారు.
అయితే, ఏపీ నుండి నిధులు రావాల్సినవి పెండింగ్ ఉన్నాయా? గత ప్రభుత్వాలు జరిపిన చర్చలు, ఏపీ ప్రభుత్వ సమాధానాలు, ఇప్పుడేం చేయాలి… ఇలాంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఫైనాన్స్, రెవెన్యూతో పాటు జీఏడీ అధికారులు ఈ మీటింగ్ కు అటెండ్ అవుతుండగా, డిప్యూటీ సీఎం భట్టి కూడా హజరుకాబోతున్నారు.
చంద్రబాబు దృష్టికి తీసుక రావాల్సిన విషయాలతో పాటు తెలంగాణ నుండి పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ కూలంకుషంగా సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులతో సమావేశం అవుతున్నారు.