ఏపీలో పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. రానున్న ఐదేళ్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఇటీవల దిశానిర్దేశం చేసిన హైకమాండ్.. ఇప్పుడు వైసీపీ బిగ్ షాట్స్ తో స్వయంగా టచ్ లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ బ్లడ్ వైసీపీలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో నేతలు దిక్కులు చూస్తున్నారు. టీడీపీ, జనసేనలోకి వెళ్లాలనుకున్నా కూటమి పార్టీలు డోర్స్ క్లోజ్ చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతుండటం వైసీపీ నేతలను ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో పుంజుకోవడంతో భవిష్యత్ కోసం జాతీయ పార్టీలోకి వెళ్లాలని వైసీపీ నేతలూ భావిస్తున్నారు.
ఇటీవల షర్మిల ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత కొద్ది రోజులకిందట రాహుల్ గాంధీ వైసీపీ మాజీ మంత్రులకు ఫోన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మీ భవిష్యత్ కు నాది భరోసా. తొందర్లోనే మిమ్మల్ని కేసీ వేణుగోపాల్ కలుస్తారు. అనంతరం ఢిల్లీకి వచ్చి నన్ను కలవండి అంటూ వారిని పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించినట్లుగా విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఇక నుంచి రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ అంశాలపై చర్చించేందుకు మధ్యవర్తులు లేకుండా తనతో నేరుగా భేటీ కావొచ్చునని రాహుల్ వారికి అభయం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేయడం, భవిష్యత్ కు భరోసా ఇవ్వడంతో పలువురు వైసీపీ సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరే విషయంపై ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
పైగా.. కూటమి సర్కార్ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకొని నిలబడాలంటే జాతీయ స్థాయిలో అండదండలు ఉండాలని, అందుకే కాంగ్రెస్ లో చేరడంపై నేతలు చర్చిస్తున్నారని అంటున్నారు.