తెలంగాణ పాలిటిక్స్ క్రికెట్ మ్యాచ్ ను తలపిస్తున్నాయి. ప్రత్యర్ధి జట్టును కోలుకోకుండా అవతలి జట్టు ఎలాగైతే వ్యూహాలు రచిస్తుందో..బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ కూడా అలాంటి వ్యూహాలనే అనుసరిస్తోంది. బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తూ..రాజకీయాన్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకుంటోంది. రాజకీయ రంగస్థలం మీద బీఆర్ఎస్ ఏమాత్రం కుదురుకోనివ్వకుండా దూకుడు పెంచుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ను క్రమంగా బలహీనపరుస్తోంది. కాంగ్రెస్ స్పీడ్ తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఫామ్ హౌజ్ వేదికగా ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న వారిని పిలిపించుకొని భవిష్యత్ మనదేనని భరోసా ఇస్తున్నారు. తొందరపడకండి..ఐదేళ్ళు ఓపిక పట్టండి అంటూ ఎమ్మెల్యేల మైండ్ వాష్ చేస్తున్నారు.
కాంగ్రెస్ కు ఇక ఛాన్స్ ఇవ్వొద్దని ఓ వైపు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. రేవంత్ మాత్రం మరో వైపు నుంచి నరుక్కొస్తున్నారు. ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్ బిజీగా ఉండగా ఆ పార్టీ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ నాయకత్వం టచ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మండలిలోనూ బలం పెంచుకోవాలని భావిస్తోన్న కాంగ్రెస్.. ఈమేరకు బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరుపుతోందని అంటున్నారు.
ఇలా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ఉండటంతో ప్లాన్ మార్చిన కాంగ్రెస్, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే పనిలో ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ ను మరింత పతనావస్థకు నెట్టడమే లక్ష్యంగా చేరికలను కాంగ్రెస్ స్పీడప్ చేస్తుండటంతో కేసీఆర్ లో ఓ రకమైన అలజడి కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.