మాజీ సీఎం జగన్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రజల ఛీత్కారంతో అధికారం కోల్పోయి, కేవలం 11సీట్లకే పరిమితం అయిన జగన్… జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రిజల్ట్స్ చూశాక నాకు హిమాలయాలకు పోవాలనిపించింది అంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను అంటూ జనంలోకి వచ్చిన జగన్ 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రాజన్న బిడ్డను అని చెప్పుకోవటం మానేసి ప్రభుత్వ పథకాలకు కూడా తన పేరే పెట్టుకొని, వైఎస్ ను కూడా వదిలేశాడు. అయితే, మొన్నటి ఎన్నికల్లో తాను కూడా రాజన్న బిడ్డనే, వైఎస్ వారసత్వాన్నే అని ప్రజల ముందుకు వచ్చిన వైఎస్ షర్మిల సీట్లు గెలుచుకోకపోయినా, ప్రజల్లోకి వెళ్లగలిగింది.
ఇప్పుడు జగన్ కు అధికారం లేదు. వైఎస్సార్ లెగసీ కూడా దక్కేలా లేదు. ఎందుకంటే వైఎస్సార్ లెగసీని షర్మిల పక్కగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికలే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతుంది. అందుకే వైఎస్సార్ కు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా వైఎస్ జయంతిని జరిపే బాధ్యతను భుజానికెత్తుకుంది షర్మిల. వైఎస్ బిడ్డగా జయంతిని చేస్తున్నానని, విజయవాడలో ఈనెల 8న జరిగే వైఎస్ 75వ జయంతి వేడుకలకు రావాలని అందరినీ పిలుస్తున్నారు. తెలంగాణ, ఏపీలోని నాయకులను తానే వెళ్లి స్వయంగా ఆహ్వానిస్తున్నారు.
అంటే… వైఎస్ లెగసీని పూర్తిగా ఓన్ చేసుకునే పనిలో షర్మిల ఉన్నారు. పైగా వైఎస్ విజయమ్మ కూడా షర్మిలకు అండగా ఉంటున్నారు. ఇదంతా చూస్తే జగన్ కు అధికారంతో పాటు వైఎస్ లెగసీ కూడా దక్కేలా లేదు. అదే జరిగితే… జగన్ కు మరోసారి అధికారం కలే అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.