సమాజాన్ని కాపాడే బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినీ పరిశ్రమ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని కోరారు.
మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పోలీసు మీట్ లో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలను పెంచాలని కోరే వాళ్లు ఖచ్చితంగా డ్రగ్స్ నియంత్రణ కోసం సామాజిక బాధ్యతతో వీడియో సందేశాన్ని ఇవ్వాలన్నారు. అలా చేస్తేనే సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తామంటూ రేవంత్ కండిషన్ విధించారు. కేవలం టికెట్ ధరలు పెంచుకోవడమే కాదు, సామాజిక బాధ్యత కూడా అవసరమని ఈ విషయాన్ని సినీ పరిశ్రమ గుర్తించాలన్నారు.
తెలంగాణ నుంచి డ్రగ్స్ ను సమూలంగా తరిమికొట్టాలంటే అందరి సహకారం అవసరమని రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశాన్ని పంపారని గుర్తు చేసిన రేవంత్… అలాగే మరికొంతమంది ముందుకు రావాలన్నారు. డ్రగ్స్ కట్టడిలో సినీ పరిశ్రమ కూడా సహకరించాలని…ఈమేరకు సినిమా టికెట్ ధరలు పెంచాలని వచ్చే వారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా మూడు నిమిషాల వీడియోను అందించాల్సిందేనన్నారు. థియేటర్లలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ యాడ్స్ తో పాటు కొన్ని ప్రకటనలను ఉచితంగా ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.