పోలింగ్ ముగిసిన వెంటనే కేఏ పాల్ ఓ సమావేశం పెట్టారు. మీడియాను పిలిచారు. ఆ సమావేశానికి వచ్చిన వారంతా సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు. జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత తేలిందేమిటంటే వారందరికి తలా ఐదు వందలు ఇచ్చి తీసుకు వచ్చారని. ఇప్పుడు జగన్ కూడా అదే బాట పట్టారు . బెంగళూరు నుంచి ఆయన వస్తూంటే రెండు రోజుల నుంచి అలర్ట్ చేసి.. బెజవాడ నుంచి వెల్లంపల్లి, దేవినేని అవినాష్ వంటి వార్ని పురమాయించి..ఓ రెండు వందల మందిని ఎయిర్ పోర్టు వద్ద గుమికూడేలా చేశారు. వారంతా జగన్ బయటకు వస్తూంటే.. సీఎం సీఎం అని నినాదాలిచ్చారు.
ఈ సీన్ చూసి ఎయిర్ పోర్టులో ఉన్న వారు కూడా ఆశ్చర్యపోయారు. బయటకు వెళ్తే ఆ నినాదాలు చేసిన వారందరికి వెల్లంపల్లినో.. అవినాష్‌లో కూలి చెల్లించాల్సిందే. అయినా జగన్ రెడ్డికి మానసికంగా సంతృప్తి పరచడానికి సీఎం నినాదాలు చేయించడం ఏమిటని.. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాడుతున్నారని .. ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత అని నినాదాలు చేయాలన్న సెటైర్లు సహజంగానే వస్తున్నాయి.
జగన్ రెడ్డి బెంగళూరులో ఉన్నన్ని రోజులు ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు కూడా ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టేవారు లేరు. ఎప్పుడు ఎవరిపై కేసులు పడతాయోనని ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జగన్ ను నమ్ముకుని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పెద్ద ఎత్తున చేసిన అన్యాయాలకు.. జైలు పిలుస్తోందని కంగారుగా ఉన్నారు. తమ సంగతేమిటో అని ఇతర నేతలూ బిక్కుబిక్కుమంటున్నారు.