ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కాదు..పదివేలు కాదు..ఏకంగా 30వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘటించారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్మాయిలు అదృశ్యమైనా ఈ విషయాన్ని గత ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని, పోలీసులు కూడా బయటపెట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిస్సయిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవాలని ఆదేశించారు.
ఆడవారి అదృశ్యంపై గతంలో అనేక మార్లు పవన్ ఆరోపణలు చేశారు.. కానీ అవి రాజకీయ ప్రేరేపితం అంటూ చాలా మంది పట్టించుకోలేదు. నాడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఆయనపై ఎదురుదాడి చేశారు. కానీ పవన్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండి, తాజాగా మరోసారి ఈ విషయాన్ని సీరియస్ గా లేవనెత్తడంతో.. గత ప్రభుత్వ హాయాంలో అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారం నిజంగానే సీక్రెట్ గా ఉంచేశారని అర్థమవుతోంది.
ఇటీవల ఓ మహిళా తన కూతురు కిడ్నాప్ అయిందని తన దృష్టికి తీసుకురావడంతో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. 9నెలల కిందట అదృశ్యమైన అమ్మాయి కేసును 48గంటల్లోనే చేధించారని… జమ్మూలో ఉన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పుడు అన్ని మిస్సింగ్ కేసుల్లోనూ ఇదే తరహ వేగం లేకపోవచ్చు కానీ, అదృశ్యమైన కొంతమందిని వారి తల్లుల ఒడులకు చేర్చితే కూటమి సర్కార్ ఎంతోమంది తల్లుల కడుపుకోతను తీర్చినట్లు అవుతుంది. ఈ విషయంలో గత సర్కార్ కు భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తుండటంతో ఇప్పుడు బాధిత కుటుంబాలు తమ బిడ్డలు తిరిగి వస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. మహిళల భద్రతకు ఎక్కడా లేని ప్రాధాన్యత ఇచ్చామని గత సర్కార్ గట్టిగానే ప్రచారం చేసుకుంది. కానీ , భారీ సంఖ్యలో అమ్మాయిలు మిస్సింగ్ అయినా ఆ వివరాలను బయటపెట్టకపోగా.. అమ్మాయిల మిస్సింగ్ కేసులను మాత్రం ఎందుకు రహస్యంగా ఉంచింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది.