‘రాజావారు రాణీగారు’, ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. ఈ సినిమాలు కిరణ్ అబ్బవరం కంటూ ఓ ఇమేజ్ తీసుకొచ్చాయి. కిరణ్ సినిమాలు ఎలా ఉంటాయన్న విషయంలో ఓ విజువల్ ఇచ్చాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా కిరణ్ ఓ ప్రయత్నం చేస్తున్నాడు. ‘క’ అనే సినిమాతో. కిరణ్ అబ్బవరం నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఈరోజు కిరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు.
‘ఎవరు నువ్వు.. ఎక్కడి నుంచి వచ్చావ్, పక్కవాళ్ల ఉత్తరాల చదివే అలవాటేంటి నీకు’ అనే ప్రశ్నలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. విజువల్స్ చూస్తే కిరణ్ అబ్బవరం క్యారెక్టర్‌పై ఓ అంచనాకు వస్తారు. తనో పోస్ట్‌మెన్. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఊర్లోవాళ్లకు వచ్చిన ఉత్తరాలు చదవడం ప్రారంభిస్తాడు. ఆ ఉత్తరాలే అతని జీవితాన్ని మార్చివేస్తాయి. అదెలా? అనేది తెరపై చూడాలి. టీజర్ చూస్తే ఈ సినిమాలో చాలా జోనర్లు మిక్స్ అయినట్టు అనిపిస్తోంది. ఆర్ట్, సెట్ వర్క్, కెమెరా పనితనం పిరియాడిక్ లుక్‌ని తీసుకురావడంలో సఫలం అయ్యాయి. ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకొన్నాయి. కాంతార, పుష్ష ప్రభావం ‘క’పై ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. శ్యామ్ సి ఇచ్చిన ఆర్.ఆర్ అదనపు ఆకర్షణ. కిరణ్ ఈసారి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడన్న భరోసా ఈ టీజర్ తో కలిగింది. ఖర్చు కూడా కనిపిస్తోంది. సుజిత్, సందీప్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టీజర్‌తో కిరణ్ ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇక సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.