సభ్య సమాజం అంతా తలదించుకునే ఘటన ఇది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదాంతమే ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది.
తన భర్తపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది ఓ మహిళ. అందుకోసం ఉబర్ ఆటో బుక్ చేసుకుంది. కేసు పెట్టాక, తిరిగి ఇంటికి అదే ఆటోలో బయల్దేరింది. ఉబరర్ ఆటోనే కదా సేఫ్ అనుకుంది. కానీ, అప్పటికే ఆమెపై కన్నేసిన ఆ డ్రైవర్… మాటల్లో పెట్టి, గల్లీలు తిప్పుతూ ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా వైన్స్ షాపు వద్ద ఆపాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని ఆటో ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు ఆ మహిళను వేధిస్తూ… మరో కారులోకి ఎక్కించారు. ఆ ఆటో డ్రైవర్ వెళ్లిపోగా… కారులోనే ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.
తెల్లవారుజామున వారి నుండి తప్పించుకొని రోడ్డుపై కేకలు వేయటంతో ఓ గూడ్స్ వెహికల్ డ్రైవర్ గుర్తించగా, తన సహాయంతో అల్వాల్ లోని గణేష్ టెంపుల్ కు చేరుకుంది. అక్కడి స్థానికుల సహయంతో ఆ మహిళ డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు… అల్వాల్ స్టేషన్ లో కేసు రిజిష్టర్ చేశారు. ఆటో డ్రైవర్ ను శంకర్ గా గుర్తించగా తనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.