స్టార్ ఇంట్లో కుక్క పిల్ల అయినా సెలబ్రెటీ హోదా వచ్చేస్తుంది. ఇది మాట వరసకు చెప్పడం లేదు. రామ్ చరణ్ పెంపుడు శునక వైభవం చూస్తే ఈ మాట ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. చరణ్‌కు మూగ జీవాలంటే ఇష్టం. గుర్రాల్ని, కుక్కల్ని పెంచడం హాబీ. చరణ్ చేతిలో ఓ బుజ్జి కుక్క పిల్ల ఉంటుంది. దాని పేరు.. రైమ్. ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన ఖరీదైన శునకం ఇది. రైమ్ అంటే చరణ్‌కు చాలా ఇష్టం. షూటింగ్ లేకపోతే రైమ్ తోనే గడుపుతాడు. విదేశాలకు షూటింగులకు వెళ్లినా చేతిలో రైమ్ ఉండాల్సిందే. ఉపాసనకు కూడా రైమ్ అంటే చాలా మమకారం. ఇంట్లో ఓ మనిషిలానే రైమ్ ని చూసుకొంటారు. ఇప్పుడు ఈ రైమ్కు కూడా చరణ్‌కి ఇచ్చిన గౌరవమే ఇస్తోంది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం.
సెలబ్రెటీల మైనపు విగ్రహాలు తయారు చేసి, అభిమానుల సందర్శన కోసం ఉంచుతుంటుంది లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయన చేతిలో ఇష్టమైన కుక్కపిల్ల రైమ్ కూడా ఉండబోతోందట. అలా… రైమ్ కు కూడా స్టార్ హోదా దక్కేసింది. ఇటీవల చరణ్ లండన్ వెళ్లారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు చెందిన మైనపు శిల్పుల నిపుణులు చరణ్ కొలతల్ని తీసుకొన్నారు. పనిలో పనిగా రైమ్ కు సంబంధించిన కొలతలూ వాళ్లు సేకరించారు. చరణ్ చేతిలో రైమ్.. ఇదీ మేడమ్ టుస్సాడ్స్ లో త్వరలో కనిపించబోయే దృశ్యం.