గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం..ఆ ఓటమి నుంచి తేరుకోకముందే పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించిన దారుణ ఓటమి..తెలంగాణ సాధించామని చెప్పుకున్న పార్టీకి ఈ రకమైన ఓటమి వెక్కిరింతలు ఎవరూ ఊహించనివే. మరో పదేళ్లు అధికారంలో తామే ఉంటామని ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఎక్కడో వ్యూహం ఫెయిల్ అయిందన్న బాధ బీఆర్ఎస్ ను ఇప్పటికీ వేధిస్తోంది.
బీఆర్ఎస్ ఓటమికి కారణాలు అనేకం ఉన్నా.. పార్టీ పేరు మార్పు కూడా ఓ ప్రధాన కారణమని అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. అదే బీఆర్ఎస్ కు తెలంగాణతో పేగు బంధాన్ని తెంచింది అని.. టీఆర్ఎస్ పేరుతోనే మరోసారి ఎన్నికలకు వెళ్లి ఉంటే ఫలితాలు ఊహించిన విధంగా ఉండేవేమో అని చెప్పుకొచ్చారు.
ఇకనైనా తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేశారు. తెలంగాణలో బలీయమైన శక్తిగా నిలబడాలంటే పార్టీ పేరు మార్పు తప్పనిసరి అని నేతల ఫీడ్ బ్యాక్ మేరకు ఆలోచనలో పడ్డారో మరేమో కానీ, మాజీ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ కండువాతో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
పార్టీ పేరును మార్చాలనే ఆలోచనతో అధిష్టానం ఉందని సంకేతాలు ఇచ్చేందుకే హరీష్ టీఆర్ఎస్ కండువా వేసుకున్నారా..? లేక బీఆర్ఎస్ కండువాలు లేకపోవడంతోనే పాత టీఆర్ఎస్ కండువాలు వేసుకున్నారా..? అనేది స్పష్టత లేదు. కానీ , పటాన్ చెరు కార్యకర్తల మీటింగ్ లో హరీష్ టీఆర్ఎస్ కండువాతో కనిపించడం పెద్ద చర్చకు దారితీసింది.