తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి పరుగులు పెడుతున్నారు. ఓ వైపు రాష్ట్రానికి నిధుల సేకరణ నుంచి పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణ, గతంలో నిలిచిపోయిన పనుల ప్రారంభం కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. కానీ గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చెడిపోయిన వ్యవస్థల్ని గాడిలో పెట్టకపోవడం వల్ల. .. దానిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ కష్టం అంతా చిన్నదైపోతోందన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది.
ఈ ప్రభుత్వం అనుమతి లేకుండా జీవోలా ?
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి ఆదేశాలు వచ్చినా ఆ ప్రభుత్వ అనుమతి మేరకు రావాలనేది బిజినెస్ రూల్స్. ఇది తెలియకుండా ఏ ఉద్యోగి ఉండడు. కొంత మంది గత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాల జీవోలు రిలీజ్ చేయడమేకాదు.. గెజిట్లు కూడా ప్రకటిస్తున్నారు. దీనికి కొత్త ప్రభుత్వం అనుమతి ఉందన్నట్లుగా ప్రచారం చేయడానికి అవసరమైన లీకులు ఇస్తున్నారు. ఉద్యోగు జీపీఎస్ గెజిట్ విషయంలోఅదే జరిగింది. వివాదం అయిన తర్వాత తీరిగ్గా స్పందించి.. విచారణ చేయిస్తే… పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరు ఆ పని చేయడానికి సంకోచిస్తారు. లేకపోతే అలుసైపోతారు.
వ్యవస్థలన్నీ విధ్వంసమే… !
వైసీపీ పాలనలో ఉద్యోగ వ్యవస్థే కాదు.. ప్రతీ వ్యవస్థ తన సహజమైన పనితీరును కోల్పోయింది. పోలీసులే తీసుకుంటే… తమ విధి నిర్వహణ అంటే లా అండ్ ఆర్డర్ కాదని అధికార పార్టీ సేవలో మునిగి తేలడమన్నట్లుగా మారిపోయింది. ఆ జాడ్యం ఇంకా పోలేదు. రెడ్ కార్పెట్లు, పరదాలు కట్టవద్దని చంద్రబాబు ఎన్ని సార్లు చెప్పినా కొనసాగించారు. చివరికి గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో అతికష్టం మీద నిలిపివేశారు. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణ అనేది లేకుండా ఒకరి ఆస్తి అన్నట్లుగా సాగించారు. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం ఐదేళ్ల పాటు సాగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధైర్యంగా తవ్వేసుకుంటున్నారు. ఆగలేదు. సీఎంవో ఆదేశిస్తే తప్ప ఆపలేదు. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి వ్యవస్థలోన లోపాలు ఉన్నాయి.
అన్నీ చక్కబెట్టుకోకపోతే కష్టమంతా చిల్లుకుండలో నీళ్లు పోసినట్లే !
చిల్లు కుండలో నీళ్లు పోస్తే ఎలా అయితే ఉపయోగం ఉండదో… రాష్ట్రంకోసం పని చేయాల్సిన వ్యవస్థలను సరైన విధంగా దారిలో పెట్టకుండా ఎంత కష్టపడి పని చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎంత చేసినా ఆ వ్యవస్థలే వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకూ సంస్కరించే ప్రయత్నం చేసినా ఇంకా .,.. పూర్తి కాలేదని జీపీఎస్ గెజిట్ లాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.