తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కొడుతున్నారు. రూ.రెండు లక్షల రుణమాఫీని కటాఫ్ డేట్ కంటే నెల రోజుల ముందుగానే చేస్తున్నారు. గురువారం రూ. లక్ష వరకూ రుణమాఫీ నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఆగస్టు పదిహేనో తేదీని రేవంత్ డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. అదే విషయాన్నిప్రజలకు చెప్పారు. కానీ జూలై ఇరవయ్యో తేదీ కంటే ముందే ఆ ప్రక్రియ ను ప్రారంభించేస్తున్నారు. రూ. లక్ష వరకూ రుణమాఫీ చేయడానికి అవసరమైన నిధులు లభించడంతో… గురువారమే ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో వస్తున్న విమర్శలు.. నిరుద్యోగుల ఆందోళలు.. ప్రతి చిన్న విషయంపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు వంటివి రేవంత్ రెడ్డికి చికాకుగా మారాయి. నిరుద్యోగుల ఆందోళనలను చాలా పెద్దవి చేసి చూపించేందుకు ప్రయత్నించారు. పిడికెడు మంది కోసం వాయిదా వేస్తే లక్షల మంది అసంతృప్తికి గురవుతారరన్న విషయాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తి పెరుగుతోందన్న భావన ఏర్పడుతున్న సమయంలో ఒక్క సారిగా రుణమాఫీని రేవంత్ ప్రకటించారు.
రేవంత్ ప్రకటనతో మిగిలిన సమస్యలన్నీ పక్కకుపోతాయి. రాజకీయంగా డేరింగ్ స్టెప్స్ వేయడంలో రేవంత్ రెడ్డికి ప్రత్యేకత ఉంది. ఇంత కాలం నిధులే ఉండవని. .. రేవంత్ రుణమాఫీ విషయంలో వెనుకబడిపోతారని అనుకున్నారు. కానీ 30వేల కోట్లను సమీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దీంతో విపక్షాలు లబ్దిదారుల్ని తగ్గించారని విమర్శలు ప్రారంభించారు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికే సిక్సర్ కొట్టేశారు.