విజయసాయిరెడ్డి దిగాలుగా కనిపిస్తున్నారు. తాను ఒంటరి అన్న భావనలో ఉన్నారు. తనపై ముప్పేట దాడి జరుగుతున్నా… ఒక్కరూ స్పందించకపోవడం.. పార్టీ అండగా లేకపోవడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారు. మామూలుగా అయితే విజయసాయిరెడ్డి కోసం వ్యక్తిగత అనుబంధంతో అయినా చాలా మంది స్పందించేవారు. కానీ జగన్ కు ఇష్టం లేకపోవడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. విజయసాయిరెడ్డికి సపోర్టు చేయవద్దని అంతర్గత ఆదేశాలను జగన్ ఇవ్వడంతో విజయసాయిరెడ్డికి షాక్ తగిలినట్లయింది.
విజయసాయిరెడ్డి అంటే వైసీపీకి పిల్లర్. 2019లో వైసీపీ విజయానికి తెర వెనుక కీలక పాత్ర పోషించింది విజయసాయిరెడ్డినే. తెలంగాణ పోలీసుల్ని వాడుకునే స్వేచ్చను కేసీఆర్ ఇవ్వడంతో … అటు సైబరాబాత్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ను.. ఇటు హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న అంజనీకుమార్ ను ఏక కాలంలో ఉపయోగించుకుని టీడీపీని ఎంత టార్చర్ పెట్టాలో పెట్టారు. ఆ తర్వాత బీజేపీతో సమన్వయం చేసుకున్నారు. మరో వైపు ప్రశాంత్ కిషోర్ టీం మొత్తం ఇచ్చే ప్లాన్లను ఎగ్జిక్యూట్ చేశారు. ఇక డబ్బులు ఎవరెవరికి ఎంతెంత చేర్చాలి.. నియోజకవర్గాల్లో ఎలా పంచాలన్నది ఆయన ప్లానే. అందుకే జగన్ గెలుపు ప్రకటన తర్వాత.. విజయసాయిరెడ్డినే మొదట ఆలింగనం చేసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ రూంలోకి అప్పట్లో ఎంట్రీ కూడా లేదు.
ప్రభుత్వ ఏర్పాటు తర్వాత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టి అక్కడ దోపిడీకి ప్రాధాన్య త ఇవ్వడంతో జగన్ పక్కన చేరిన సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లగా పట్టు సాధించారు. ఆ తర్వాత నుంచి విజయసాయిరెడ్డికి కష్టం ప్రారంభమయింది. విజయసాయిరెడ్డిని డీఫేమ్ చేయడం ప్రారంభించారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. కొన్నాళ్లు దూరం పెట్టారు. మళ్లీ ఎన్నికలకు కాస్త ముందే సమావేశాలకు పిలిచారు. ఇప్పుడు మళ్లీ పాత పద్దతే. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంటలిజెన్స్ ను చేతిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి ప్రైవేటు వ్యవహారాల గురించి తెలుసుకుని… అవన్నీ జగన్ ముందు పెట్టడంతోనే ఆయనను దూరం పెడుతున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. అందుకే.. తనపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని విజయసాయిరెడ్డి మథన పడుతున్నారు.
జగన్ రెడ్డి ఇంత ధనవంతుడుకావడానికి కారణం విజయసాయిరెడ్డి. అందుకే ఆయన కేసుల్లో ఇరుక్కున్నారు. కానీ ఇప్పుడు ఆ జగన్ రెడ్డే ఆయనను నమ్మడం లేదు.