ఇవి చేతులు కాదు కాళ్లనుకోండి అని ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు టీడీపీ నేతల్ని బతిమాలుకుంటున్నారు. స్వయంగా టీడీపీ ఆఫీసుకు వచ్చి మరీ తమను క్షమించాలని వేడుకున్నారు. ఎందుకంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారుల సంఘం నేతల పేరుతో కొంత మంది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తొడలు కొట్టారు.. బూతులు తిట్టారు. చొక్కా విప్పితే మేమూ రౌడీలమే అన్నారు… అబ్బో చెప్పాలనుకుంటే వారిది పెద్ద చరిత్ర అవుతుంది. అసలు రాజకీయాలతో వారికేం పని అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారే సరికి అందరికీ భయం వేస్తోంది.
పోలీసు అధికారుల సంఘంలో జనకుల శ్రీనివాసరావు అనే వ్యక్తి సహా మరికొంత మంది చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ప్రతీ దాంట్లోనూ ముందుకొచ్చి.. వైసీపీ నేతల కన్నా ఓవరాక్షన్ చేసేవారు. ఇప్పుడు తాము ఎలా ముఖం చూపించాలనుకుంటున్నారో కానీ.. పోలీసు అధికారుల సంఘం నేతలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెల్లారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల కారణంగానే గతంలో చంద్రబాబును దూషించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. గత పరిణామాలు మనసులో పెట్టుకోవద్దని, తమను క్షమించాలని కోరారు.
నాటి డీజీపీ రాష్ట్ర పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. తమను పావులుగా వాడుకున్నారని, తాము చేసిన పనికి చాలా బాధపడ్డామని విషణ్ణ వదనంతో చెప్పుకొచ్చారు. ఈ నేతలందరిపై శాఖాపరమైన విచారణలు పెండింగ్ లో ఉన్నాయి. సర్వీస్ రూల్స్ కూడా ఉల్లంఘించారు. మరి క్షమాపణలు చెప్పారని సైలెంట్ అయిపోతారా.. చర్యలు తీసుకుంటారా అన్నది టీడీపీ నేతల చేతుల్లోనే ఉంది.