కల్కి తప్పితే బాక్సాఫీసు వద్ద మరో పెద్ద సినిమా లేదు. ఈ వారం కూడా డార్లింగ్, పేక మేడలు లాంటి చిన్న సినిమాలతోనే సరిపోయింది. రానున్న శుక్రవారం జూలై 26కి కూడా తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఆ డేట్ సోలో గా తమిళ స్టార్ ధనుష్ కి దొరికింది. ధనుష్ రాయన్ జూలై 26న వస్తోంది. అయితే ఈ సినిమాపై రావాల్సిన బజ్ ఇంకా రాలేదనే చెప్పాలి.రాయన్ టైటిల్ క్యాచిగా లేదు.డబ్బింగ్ సినిమా వాసనే కొడుతోంది. ఇటివలే ట్రైలర్ వదిలారు. అందులోని యాక్షన్ ఆకట్టుకుంది.అయితే ఈ బజ్ సరిపోదు.
ఇటివలే మహారాజ్ డబ్బింగ్ సినిమాగా ఇక్కడ అద్భుతమైన ఫలితం చూసింది. విజయ్ సేతుపతి ప్రమోషన్స్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. ఇక్కడ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమాకి హిట్ టాక్ వచ్చిన తర్వాత సక్సెస్ మీట్ కి కూడా ఇక్కడికి వచ్చారు.
రాయన్ ప్రమోషన్స్ లో ఇంకా కదలిక లేదు. ధనుష్ కి తెలుగులో ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నేరుగా తెలుగు సినిమా చేస్తున్నారు. రాయన్ ఆయనకి యాభైవ సినిమా, ఆయనే దర్శకుడు కూడా. ఆయన చొరవ తీసుకొని ప్రమోషన్స్ లో దూకుడు పెంచితే బజ్ క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు.