అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతాం..ఏపీలో ఆందోళనలు చేపడుతాం..దేశమంతా ఏపీ వైపు తొంగిచూసేలా వినుకొండ ఘటనపై పోరాటం చేస్తామని ఎమ్మెల్యే జగన్ ప్రకటనల అంతర్యం ఏంటి అని జోరుగా చర్చ జరుగుతోంది.
అసెంబ్లీకి వెళ్లి చేసేదేమీ లేదని నిర్వేదం వ్యక్తం చేసిన జగన్ అనూహ్యంగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వైసీపీని కూడా ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలో జగన్ కు ఉచ్చు బిగించేలా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేతపత్రాల విడుదల వేదికను అసెంబ్లీకి షిఫ్ట్ చేశారు. దీంతో కూటమి నేతలు ఎలాగూ సభలో వైసీపీని టార్గెట్ చేస్తారు. అధికార పక్షం నుంచి వచ్చే కౌంటర్లను ఎదుర్కొని అసెంబ్లీలో నిలబడటం జగన్ కు సాధ్యమయ్యే పని కాదు. అందుకే వినుకొండ ఘటనపై రాజకీయం చేసి అసెంబ్లీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు.
ఎలాగూ వినుకొండ ఘటనపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకున్న జగన్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతామని ముందే ప్రకటించడం వెనక వ్యూహం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమే. దీని బూచిగా చూపుతూ.. తనను సస్పెండ్ చేశారని.. ఇక కూటమి సర్కార్ పై ప్రజల్లోనే తేల్చుకుంటానని అసెంబ్లీని జగన్ బహిష్కరించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో జగన్ ను సస్పెండ్ చేయకపోతే ఉద్దేశపూర్వకంగా సభలో నానా రభస సృష్టించి సభను వాకౌట్ చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదంతా సవ్యంగా సాగినా.. ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రపతిని కలుస్తామని చెప్పిన జగన్.. ఒకటి , రెండు రోజులు మినహా పూర్తి స్థాయిలో అసెంబ్లీకి హాజరు కారని తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకే జగన్ నిర్ణయించుకున్నారని తాజా పరిణామాలతో స్పష్టం అవుతోంది.