విజయాలు వస్తున్నప్పుడు అందరూ అపరచాణక్యుడు అని కేసీఆర్ ని పొగిడారు. ఇప్పుడు ఆయన ఏం చేసినా రివర్స్ అవుతూంటే… ఏమని విమర్శించాలో తెలియక బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ గగ్గోలు పెడుతున్నారు.. బీజేపీ బలపడితే బీఆర్ఎస్ కే నష్టమని తెలిసినా పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్ష సాయం చేశారు. ఫలితంగా బీజేపీకి 35 శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్ వాటా 16 శాతానికి పడిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా బీజేపీ తో పొత్తు, విలీనం అనే ప్రచారానికి చాన్స్ ఇవ్వడంతో అసలు బీఆర్ఎస్ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోతోంది.
నిజానికి కేసీఆర్ బీజేపీతో కలిసే వ్యూహానికి పదును పెట్టిన లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. బీజేపీతో అయితే పొత్తులు పెట్టుకుని లేకపోతే విలీనం చేసి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అధికారికంగా బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. కానీ కేసీఆర్.. అరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ సీనియర్ నేత తనకు ఫోన్ చేశారని ఆయన గతంలో చెప్పారు.
బీజేపీ తల్చుకుంటే ఆపరేషన్ కమల్ ప్రారంభిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం పెద్ద పనేమీ కాదని ఎక్కువ మంది భావన. ఈ ఆలోచనలతోనే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహన్ని పసిగట్టిన రేవంత్ పది మంది ఎమ్మెల్యేల్ని లాగేసుకున్నారు. మరో పది మందిని రెడీగా పెట్టుకుంటున్నారు. అంటే కేసీఆర్ ప్లాన్ పూర్తిగా వికటించి… రెండు వైపులా నష్టపోయే పరిస్థితికి వచ్చారు బీజేపీతో పొత్తు, విలీనం ఏదైనా .. కేసీఆర్ రాజకీయ జీవితానికి ముగింపేనని ఎక్కువ మంది భావన.