కాంగ్రెస్ నేతలు అవసరం లేని అంశాలను కెలుక్కోని లేనిపోని తిప్పలు తెచ్చుకుంటారు. అలాంటి ఘనకార్యాలు చేయడంలో జగ్గారెడ్డి ఒకరు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో రుణమాఫీ అంశంపై విపక్షాలను విమర్శించేందుకు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవిని కూడా కలిపేశారు. ఆయన రైతు సమస్యలపై సినిమా తీసి లాభం పొందారని.. ఇప్పుడు పవన్ బీజేపీతో కలిశారని అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. అసలు చిరంజీవి రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఆయనను ఇందులోకి లాగాల్సిన అవసరం లేదు. కానీ లాగేశారు. పవన్ ను కూడా కలిపారు. కానీ నువ్వు నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారని రెచ్చిపోయారు.
జగ్గారెడ్డి తీరు ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది. రైతు సమస్యలపై సినిమాలు తీస్తే.. రాజకీయాలు మాట్లాడాలని ఎక్కడా లేదు. దేశంలో రాజకీయ పార్టీల విధానాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని లేదు. రైతు సమస్యలను బలంగా సినిమా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా రైతులకు మేలు చేసినట్లే. లాభాలొచ్చాయో లేదో ఆ నిర్మాతకే తెలియాలి. అయినా బోడిగుండుకు మోకాలికి ముడిపెడినట్లుగా రైతురుణమాఫీకి.. బీజేపీ చేసే విమర్శలకు.,. పవన్ కల్యాణ్ , చిరంజీవికి సంబంధమే లేదు.
కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై విమర్శలు చేస్తే… తెలంగాణ బీజేపీ నేతల్ని విమర్శించుకుంటే సరిపోతుంది. అంతే కాని రాజకీయాల్లో లేని మెగాస్టార్ ను లాగితే ఏమొస్తుంది ?. లేనిపోని వివాదాలతో పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.