బీహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అర్హతలు లేవని కేంద్రం నిర్మోహమాటంగా పార్లమెంట్ లో ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన అడ్వాంటేజ్ తో బీహార్ సీఎం నితీష్ కుమార్ పదే పదే హోదా గురించి ప్రస్తావిస్తున్నారు. హోదా ఇవ్వకపోతే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ సభ్యులు పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. బీహార్‌కు ప్రత్యేకహోదా ప్రశ్నే లేదని అందుకు అర్హత లేదని తేల్చేసింది.
ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు !
బీహార్‌కు లేని హోదా ఏపీకి ఇస్తారని ఎవరూ అనుకోవడంలేదు. ఏ విధంగా చూసినా బీహార్ కంటే మెరుగైన రాష్ట్రం ఏపీ. తలసరి ఆదాయం కూడా ఎక్కువే. ఇంకా చెప్పాలంటే ఓ సీఎం ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకునే తీరు మరే రాష్ట్రంలోనూ ఉండదు. ఇలాంటివన్నీ ప్రత్యేకహోదా అర్హతల ప్రకారం చూసినా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు. ఈ విషయాన్ని బీహార్‌కు ఇచ్చిన సమాధానాన్ని ఏపీకి వర్తింప చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
హోదా పేరుతో పార్టీల రాజకీయం
ప్రత్యేకహోదా తెస్తామని… ఇస్తామని గత ఎన్నికల్లో ఒక్క కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీలు ప్రచారం చేయలేదు. జగన్ మేనిఫెస్టోలో పెట్టిన 2019లో మెడలు వంచకుండా తానే వంచి వచ్చారు. తెలుగుదేశంపార్టీ అసలు హోదా ప్రస్తావన తీసుకు రావడం లేదు . అది అసలు అసాధ్యమని దాని గురించి పట్టించుకుంటే… విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లవుతుందని అనుకుంటోంది. రాష్ట్రానికి వీలైనంత ఆర్థిక సాయం తెచ్చుకోవడమే ముఖ్యంగా ఆయన భావిస్తున్నారు.
హోదా ముగిసిన అధ్యాయం
ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం. ప్రజల్లో కూడా దీనిపై విరక్తి వచ్చింది. రాజకీయ పార్టీలు తమలో ఉన్న ప్రత్యేకహోదా ఎమోషన్ తో ఆటలాడుకున్నాయని వారు భావించారు. అందుకే ఇప్పుడు ఎవరైనా ప్రత్యేకహోదా అన్నా పట్టించుకోవడంలేదు. ఏ విధంగా చూసినా ఇప్పుడు హోదా అనేది ముగిసిన అధ్యాయం.