కల్కి విడుదలకు ముందే ఫారెన్ వెళ్లిపోయాడు ప్రభాస్. కల్కి విజయాన్ని అక్కడి నుంచే సెలబ్రేట్ చేసుకొన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈనెలంతా ప్రభాస్ విశ్రాంతి మోడ్‌లోనే ఉంటాడు. ఆగస్టు మాత్రం ప్రభాస్ ఫుల్ బిజీ. ఆగస్టు 2 నుంచి `రాజాసాబ్`కు డేట్లు ఇచ్చాడు ప్రభాస్. దానికి తగ్గట్టుగానే మారుతి ఆగస్టులో ఓ కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీన్ కూడా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి.
Also read : ఎక్స్‌క్లూజీవ్: బ్రాహ్మణుడిగా ప్రభాస్
మరోవైపు హనురాఘవపూడి కథకు ప్రభాస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు లేదంటే అక్టోబరులో ఈ సినిమా మొదలవ్వబోతోందన్న ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్లాన్ మారింది. ఆగస్టులోనే ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఆగస్టు 22 నుంచి హను సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ రోజు నుంచే షూటింగ్ కూడా మొదలు. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో ప్రభాస్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. అలా ఆగస్టు మొత్తం ఈ రెండు సినిమాలతో బిజీగా గడిపేయనున్నాడు ప్రభాస్. ఈలోగా సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ‘స్పిరిట్’కు సంబంధించిన కథా చర్చలు జరగబోతున్నాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. నవంబరు నాటికి ‘రాజాసాబ్’ సినిమా పూర్తి చేయాలన్న ధ్యేయంలో ఉన్నాడు ప్రభాస్. ఈమధ్యలో హను రాఘవపూడికి కూడా కొన్ని డేట్లు ఇస్తాడు.