రాజ్ తరుణ్ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. తను నటిస్తున్న రెండు సినిమాలు కేవలం ఒక వారం గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి స్టేజ్‌లో ఏ హీరో అయినా రెండు సినిమాల ప్రమోషన్లు చేసుకొంటూ బిజీగా ఉండాలి. కానీ రాజ్ తరుణ్ మాత్రం రెండు ప్రమోషన్లకూ డుమ్మా కొట్టేశాడు.
రాజ్ తరుణ్ నటించిన ‘పురుషోత్తముడు’ ఈవారం విడుదల కానుంది. వచ్చే వారంలో ‘తిరగబడరాసామి’ వస్తోంది. చాలా కాలంగా సినిమాల్లేక ఖాళీగా ఉన్న రాజ్ తరుణ్‌కి కెరీర్లో ఇది చాలా కీలకమైన తరుణం. మామూలుగా అయితే… తన సినిమాల్ని ఎలాగైనా నిలబెట్టాలన్న తాపత్రయంతో ప్రమోషన్లు చురుగ్గా చేయాలి. కానీ రాజ్ తరుణ్ మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. ‘ఈ సినిమా ప్రమోషన్లకు నేను రాను’ అంటూ నిర్మాతలకు చెప్పేశాడు. ఇటీవల రాజ్ తరుణ్ వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. లావణ్యతో ఎఫైర్ బెడసికొట్టి పోలీస్ స్టేషన్, కోర్టులూ అంటూ కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు ఎప్పుడు దేని కోసం వచ్చినా, టాపిక్ మళ్లీ తన పర్సనల్ లైఫ్ వైపు మళ్లుతుందని, దాని వల్ల లేని పోని సమస్యలు చుట్టుకొంటాయని భయపడుతున్నాడు రాజ్ తరుణ్. అందుకే ప్రమోషన్లలో కనిపించడం లేదు. ‘పురుషోత్తముడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు హైదరాబాద్ లో ఓ హోటెల్ లో జరిగింది. ఈ కార్యక్రమం హీరో లేకుండానే ముగిసింది. ప్రమోషనల్ ఇంటర్వ్యూలలోనూ రాజ్ తరుణ్ లేడు. రాజ్ తరుణ్ బాధని అర్థం చేసుకొన్న నిర్మాతలు పైకి ఏమీ అనలేకపోతున్నారు. హీరో లేకుండా తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం ఏ నిర్మాతలకైనా కష్టమే. ఆ కష్టాన్ని ఇప్పుడు రాజ్ తరుణ్ నిర్మాతలు అనుభవిస్తున్నారు.