కొట్టకపోయిన ఏడవడం… ఓడించారని ఏడవడం… అన్యాయమైపోయానని కిందా మీదా పడటం.. అందరి మీదా కుట్రలు చేసి..తనపైనే కుట్రలు చేస్తున్నారని శోకండాలు పెట్టడం జగన్ రెడ్డి రాజకీయ పరమపద సోపానాల్లో కీలక మెట్లు. ప్రజలు తనపై జాలి చూపించి ఒక్క ఓటు వేయాలని అడుక్కోవడమే ఆయన స్టైల్. ఇప్పుడు అత్యంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. అసలేమీ జరగకపోయినా ఏదో జరిగినట్లుగా ఢిల్లీలో ధర్నా దగ్గర నుంచి రాదని తెలిసి కూడా ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టుకు వెళ్లడం వరకూ ఇదే వ్యూహం ఉంది.
స్పీకర్ను కోర్టులు ఆదేశించలేవని జగన్కు తెలుసు !
ప్రతిపక్ష నేత హోదా ఇప్పించేలా స్పీకర్ ను ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ చూసి చాలా మంది టీడీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. ఇంత పిచ్చోడేంటి… అడుక్కుంటున్నాడేంటి అని గేలిచేస్తున్నారు. జగన్ కు కావాల్సింది కూడా అదే. హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలగానే.. నలభై శాతం ఓట్లేసిన తనను ప్రతిపక్ష నేతగా గుర్తించలేదని ఆయన ఏడుపు లంకిచుకోనున్నారు. సానుభూతిపోరులో ఇది మొదటి అడుగు.
Also Read : ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకు జగన్
శాంతిభద్రతలపై ఆయన ఏడుపు శాంపిలే !
ఏపీలో ఏదో జరిగిపోతోందని ఢిల్లీకి పోయిన జగన్.. యాభై రోజులు కూడా ఆగకుండానే టీడీపీ విఫలమయిందని ఆరోపించడం ప్రారంభించారు. ఎవరేమనుకున్నా ఆయన దారి ఆయనదే. ఎందుకంటే రాష్ట్రాన్ని ఎంతగా భ్రష్టుపట్టించినా ఆయనకు దాదాపుగా నలభై శాతం ఓట్లు వచ్చాయి. అదే ఆయన బలం. తాను చెప్పే.. చేసే అడ్డగోలు మాటలు, పనులకే అంత భారీ సపోర్టు లభిస్తే ఇక వెనకా ముందు చూసుకోవాల్సిన అవసరం లేదని భావన. అందుకే ..తన ఏడుపు రాజకీయాలతో మరో పది శాతం మందిని ఆకట్టుకోగలనని… సానుభూతిని మించిన రాజకీయ అస్త్రం మరొకటి లేదని ఆయన భావన.
కానీ జగన్ చేసిన పనుల్ని జనం మర్చిపోతారా ?
ఆయన ఇప్పుడు ఏదో అయిపోతోందని అంటున్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురికాని వారు లేరు. మధ్యతరగతి జనం మొత్తం సఫర్ అయ్యారు. శాంతిభద్రతలు లేవు. వైసీపీ సపోర్టర్ కాకపోతే బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. సీఎం హోదాలో ఉండి దాడులు చేస్తే సమర్థించిన చరిత్ర ఆయనది. ఆయన చేసిన పాపాలు మర్చిపోయి.. ఆయన వేసే నాటకాలకు..ప్రజలు అయ్యో పాపం అంటారా అన్నదే ఇక్కడ కీలకం.