బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. ‘టైసన్ నాయుడు’, ‘కిష్కిందపురి’తో పాటు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని ఇటీవలే సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. మహేష్, చందు నిర్మాతలు. ఈ సినిమా కోసం ‘హైందవ’ అనే పేరు పరిశీస్తున్నారు. అదే ఖాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా దశావతారాల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో ఓ పాట దశావతారాల నేపథ్యంలో సాగుతుంది. అది మినహాయిస్తే తెలుగు స్క్రీన్‌పై దశావతారాల రిఫరెన్స్ పెద్దగా లేదు. ఈ సినిమా ఏకంగా దశావతారాల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. 400 ఏళ్ల నాటి పురాతన ఆలయ ఈ కథలో కీలక పాత్ర కానుంది. అక్కడే దశావతారాలు ప్రతిష్టించి ఉంటాయట. ఆ గుడికీ, దశావతారాలకూ, హీరోకీ సంబంధం ఏమిటన్నది తెరపై చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఈ గుడికి సంబంధించిన భారీ సెట్ తీర్చిదిద్దుతున్నారు. అక్కడ కీలకభాగం షూటింగ్ సాగబోతోంది.
Also Read : బెల్లంకొండ.. ఒకేరోజు రెండు సినిమాలు
బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈనెల 1 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం బెల్లంకొండ తదితరులపై నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 7 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బెల్లంకొండ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.