అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ కు ఏదీ కలిసి రావడం లేదు. అధికార కాంగ్రెస్ , సీఎం రేవంత్ రెడ్డిని కార్నర్ చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నా ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చి.. బడ్జెట్ పై అధికార పక్షాన్ని అసెంబ్లీలో చీల్చి చెండాడుతానని నిప్పులు చెరిగిన కేసీఆర్.. మరో రూపంలో కాంగ్రెస్ చేతికి చిక్కారు.
రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన కేసీఆర్ ఎందుకు కేంద్ర బడ్జెట్ పై మాట మాత్రం స్పందించలేదు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. పైగా.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. కేంద్రం వైఖరిపై చర్చించేందుకు బుధవారం అసెంబ్లీకి కేసీఆర్ రావాలని రేవంత్ కోరినా బీఆర్ఎస్ బాస్ పట్టించుకోలేదు. కానీ, ఆ మరుసటి రోజే అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర బడ్జెట్ పై కేసీఆర్ చేసిన ప్రసంగం వైరల్ అవుతున్నా.. ఎందుకు కేంద్ర బడ్జెట్ పై కనీసం అసంతృప్తి వ్యక్తం చేయలేదన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : వావ్… కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా వార్తే అయ్యింది
ఇప్పుడు ఇదే ప్రశ్నను కాంగ్రెస్ కూడా లేవనెత్తడంతో బీఆర్ఎస్ బాస్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర చేసిన ప్రసంగం అంతా భూమ్ రాంగ్ అవుతోంది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లపై కేసీఆర్ స్పందించి ఉంటే.. మొదటి రోజు చేసిన ప్రసంగం ద్వారా ఆయన హీరో అయ్యేవారు. కానీ కేవలం రాష్ట్ర బడ్జెట్ పైనే విమర్శలు చేయడంతో.. కేసీఆర్ అసెంబ్లీకి రాక, కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న పోరాటంపై ప్రజల్లో చర్చ లేకుండా చేసేందుకే గులాబీ దళపతి రేవంత్ సర్కార్ పై గర్జించారని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.