ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి…అక్కడి నుంచి తాడేపల్లికి వచ్చి రెండు రోజుల్లోనే తిరిగి బెంగళూర్ కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.
జగన్ సడెన్ గా బెంగళూర్ కు ఎందుకు వెళ్లారు..? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, తమ పార్టీ కార్యకర్తలపై నర మేధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న జగన్..నిజంగా అదే జరిగితే కార్యకర్తల కోసం ఆయన రాష్ట్రంలోనే ఉండాలి. కార్యకర్తల కోసం నిలబడాలి. వారికి నేనున్నానని భరోసా ఇవ్వాలి. కానీ, జగన్ మాత్రం రాష్ట్రం విడిచి వెళ్లడం పట్ల వైసీపీలో పార్టీ అధినేత వైఖరిపై అసహనం వ్యక్తం అవుతోంది.
Also Read : జగన్ ఇంక మారడా..ఇలా అయితే కష్టమే!
జగన్ పర్యటన ఎలాంటిదైనా..రోజుల వ్యవధిలోనే తిరిగి బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు పడుతున్నాయని ప్రచారం జరుగుతోన్న క్రమంలో..కాంగ్రెస్ లో చేరికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించే డీకే శివ కుమార్ ఉండే బెంగళూరుకు వెళ్ళడం హాట్ టాపిక్ అవుతోంది.
షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకురావడంలోనూ డీకేనే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు జగన్ కూడా కాంగ్రెస్ వైపు తొంగిచూస్తున్నారని కథనాలు వస్తున్న వేళ.. జగన్ అనూహ్యంగా బెంగళూరు వెళ్ళడం కలకలం రేపుతోంది. ఈ పర్యటనలో ఆయన ఎవర్ని కలవకున్నా రాజకీయంగా చర్చ జరగడం ఖాయం. అయినా జగన్ ఈ సమయంలో బెంగళూరు వెళ్ళారంటే ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.