తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS)ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని నిర్ణయించారు. జిల్లాల్లో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోనున్నారు.
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని 2020లో తీసుకు వచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న, మద్యతరగతి ప్రజల నుంచి మొదలుకుని రియల్టర్ల వరకు పోటీ పడ్డారు. రెండు నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4 లక్షలు, మున్సిపాలిటీల్లో 10 లక్షలు, పంచాయతీల్లో 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
Also Read : జోరుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్
మొదటి దశలో దరఖాస్తుల పరిశీలన, రెండవ దశలో స్థలాల క్రమబద్ధీకరణ అర్హత గుర్తించి సిఫారసు చేయడం, మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేసే ప్రక్రియ వరకూ సాగింది. తర్వాత పూర్తిగా ఆగిపోయింది. కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారులు మార్చి 31లోగా లే-అవుట్లను క్రమబద్ధీకరించుకనేందుకు అవకాశం కల్పించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించనున్నారు.
ప్రభుత్వానికి పది వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. నిబంధలకు అనుగుణంగా లే ఔట్లను క్రమబద్దీకరించుకుటే..తెలంగాణలో రియల్ ఎస్టేట్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది.