బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రూపొందించిన బడ్జెట్ ను హరీష్ స్వాగతించకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్న ఆయన.. బీఆర్ఎస్ కు నిజాయితీ ఉంటే బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ , గొర్రెల పంపిణీపై విచారణకు సిద్దంగా ఉన్నారో లేదో చెప్పాలని రేవంత్ సవాల్ చేశారు. దీంతో త్వరలోనే ఈ విషయంపై సర్కార్ విచారణ జరపనున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించిన కేసీఆర్ !
ఇప్పటికే గొర్రెల స్కామ్ పై విచారణ ప్రారంభమైంది. వీటికి తోడు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తోన్న నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారని..బడ్జెట్ పై చర్చ సందర్భంగా హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చే సమయంలో రేవంత్ తన ప్రసంగం ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారని అంటున్నారు.
బతుకమ్మ చీరల తయారీ టెండర్ సూరత్ కు అప్పగించడం వెనక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ గతంలోనే ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో నిధుల గోల్ మాల్ జరిగిందని ఆరోపించింది. అధికారంలోకి వచ్చాక లెక్క తేల్చుతామని అప్పట్లోనే ప్రకటించింది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ మాట్లాడుతూ..విచారణకు బీఆర్ఎస్ సిద్దమా అంటూ సవాల్ చేయడంతో ఈ విషయంలో విచారణ ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పెద్దలు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.